
లైసెన్స్‌ల జారీలో దళారుల దగా!
బషీరాబాద్: టీఎఫ్‌టీ లైసెన్స్‌ల జారీలో అవినీతి రాజ్యమేలుతోంది. కల్లు విక్రయించేందుకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ గీత కార్మికుడి నుంచి మధ్యవర్తులు ఏకంగా రూ.85 వేలు వసూలు చేశారు. ఈ ఘటన బషీరాబాద్ మండలం ఎక్మాయిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పోతుల బాలయ్యగౌడ్ వ్యవసాయంతో పాటు గీత కార్మికుడిగా జీనవం సాగిస్తున్నాడు. ఇతను కల్లు దుకాణం లైసెన్స్ కోసం ఈఏడాది జనవరిలో తాండూరు ఆబ్కారీ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఫిబ్రవరి 19న ఇతనికి టాపింగ్ పరీక్ష నిర్వహించిన అధికారులు లైసెన్స్ జారీ కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. రోజులు గడుస్తున్నా లైసెన్స్ రాకపోవడంతో బాధితుడు ఓ స్థానిక నాయకుడిని ఆశ్రయించాడు. ఇందుకు రూ.70 వేలు ఖర్చవుతుందని చెప్పడంతో తన భార్య బంగారాన్ని తాకట్టు పెట్టి.. సదరు లీడర్‌కు రూ.65 వేలు ఇచ్చాడు. అనంతరం ఎన్నిసార్లు వాకబు చేసినా ఏదో కారణం చెబుతూ దాటవేయడంతో బాధితుడు ఎకై ్సజ్ కార్యాలయంలో పనిచేసే ఓ ప్రైవేటు ఉద్యోగిని సంప్రదించాడు. రూ.40 వేలు ఇస్తే అధికారులతో పని పూర్తి చేయిస్తానని చెప్పడంతో రూ.20 వేలు ఇచ్చాడు. ఈక్రమంలో అతనికి లైసెన్స్ మంజూరైంది. ఇదిలా ఉండగా తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు బాలయ్య, అతని భార్య నర్సింగమ్మ మంగళవారం సదరు నాయకుడిని నిలదీశారు. అయితే నేను పైరవీ చేయడంతోనే మీకు లైసెన్స్ వచ్చిందంటూ లీడర్ తమను దబాయించాడని బాధితులు వాపోయారు.
ఆబ్కారీ అధికారుల పేరుతో
మధ్యవర్తుల వసూళ్లు
ఎక్మాయిలో ఓ గీత కార్మికుడి
నిలువు దోపిడీ
మా ప్రమేయం లేదు
గీత కార్మికుడు పోతుల బాలయ్య దరఖాస్తును పరిశీలించి, అన్ని పరీక్షలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. అన్ని అర్హతలు కలిగి ఉండటంతో అతనికి లైసెన్స్ జారీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వ ఛాలన్ డబ్బులు మాత్రమే కట్టించుకున్నాం. మధ్యవర్తులు తీసుకున్న డబ్బులతో మాకెలాంటి సంబంధం లేదు.
– రవికుమార్, ఎకై ్సజ్ ఎస్‌ఐ