
విద్యారంగ సమస్యలు పరిష్కరించండి
అనంతగిరి: విద్యారంగంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకుడు ఏ.రాములు(టీఎస్ యూటీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) వికారాబాద్ జిల్లా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పదోన్నతులను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. జీవో నంబర్ 25ను సవరించి కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా 40 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా, ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు వర్క్ లోడ్ కనుగుణంగా టీచర్ పోస్టులు కేటాయించాలన్నారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుల పెన్షన్ బెనిఫిట్స్ విడుదల చేయాలని తెలిపారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి పర్యవేక్షణాధికారి పోస్టులను నింపాలన్నారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేసి బీఈడీ, డీఈడీ అర్హతలు ఉన్న సీనియర్ ఎస్‌జీటీ లందరికీ ప్రమోషన్ అవకాశం కల్పించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని, కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్ష, కాంట్రాక్టు ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయాలని కోరారు. మోడల్ స్కూల్స్, గురుకుల సిబ్బందికి 010 ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు ఇవ్వాలని, పీఆర్‌సీ నివేదికను వెంటనే తెప్పించుకొని జూలై 2023 నుంచి అమలు చేయాలని విన్నవించారు. జీవో 317 కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్థానిక జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. డీఎస్సీ 2008 కాంట్రాక్టు టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, 12 నెలల వేతనాలు చెల్లించాలని వర్తింపచేయాలన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ సుధీర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు బాబురావు, టి.పవన్ కుమార్, శివరాజ్, బసప్ప, వికారాబాద్ మండల అధ్యక్షుడు రాములు, ధారూరు అధ్యక్షుడు అజయ్ కుమార్, కోటపల్లి అధ్యక్షుడు రాంచంద్రయ్య, జిల్లా నాయకులు వినోద్ కుమార్, పరమేష్, ప్రభాకర్, వికారాబాద్ మండల ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ నాయకుడు రాములు డిమాండ్
యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా