
లేన్లుగా..
నాలుగు లేన్లుగా విస్తరించనున్న హైదరాబాద్ – బీజాపూర్ రహదారి
కొడంగల్: హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిని(ఎన్‌హెచ్ 163) జిల్లా పరిధిలో మరింత విస్తరించనున్నారు. మన్నెగూడ నుంచి కొడంగల్ మండలం రావులపల్లి వరకు నాలుగు లేన్ల రహదారిగా మార్చనున్నారు. మొత్తం 73 కిలో మీటర్ల మేర రోడ్డు విస్తరణకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ అనుమతి మంజూరు చేసింది. భూసేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పటి వరకు ఉన్న రెండు వరుసల రోడ్డును ఇకపై నాలుగు లేన్లుగా మారుస్తారు. ఐదేళ్ల క్రితం హైదరాబాద్ – బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా మార్చింది. ఎన్‌హెచ్ 163గా నామకరణం చేసింది. కొన్ని సాంకేతిక సమస్యలు, కోర్టు కేసుల కారణంగా హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు పనులు జరగలేదు. మన్నెగూడ నుంచి పరిగి, కొడంగల్ మీదుగా తెలంగాణ సరిహద్దు వరకు జాతీయ రహదారిని నిర్మించారు. రెండు లేన్ల రహదారి వేశారు. ప్రస్తుతం దీన్ని విస్తరించడానికి కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2028 నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంపై బాధ్యతలు
జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ఉంచింది. ఇందుకు అవసరమైన భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. డీపీఆర్ అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయనుంది. రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయిన తర్వాత వాహనాల నుంచి టోల్ వసూలు చేస్తారు. జిల్లాలో ఇప్పటికే కొడంగల్ మండలం చిట్లపల్లి గేటు సమీపంలో ఒక టోల్ గేటు ఉంది. రహదారి విస్తరణ పూర్తి అయితే రెండో టోల్ గేట్‌ను మన్నెగూడ – పరిగి మధ్యలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ రహదారి పనులు పూర్తయితే పరిగి, కొడంగల్ పట్టణాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
మన్నెగూడ – రావులపల్లి రోడ్డు విస్తరణ
73 కిలోమీటర్ల మేర పనులు
నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
అన్ని వర్గాలకు మేలు
నాలుగు లేన్ల రోడ్డు అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థ మరింత మెరుగు పడుతుంది. నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్ వెళ్లి రావడానికి సులభంగా ఉంటుంది. పరిగి, కొడంగల్ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది.
– తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కొడంగల్ ఇన్‌చార్జ్