
సత్వరం పరిష్కరించండి
దౌల్తాబాద్: భూ భారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరితో కలిసి సందర్శించారు. రెవెన్యూ సదస్సుల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఇంత వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేశారని తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. వీటన్నింటినీ వారంలోగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం మండలంలోని దౌల్తాబాద్, తిమ్మారెడ్డిపల్లి, బాలంపేట, గోకఫసలవాద్ గ్రామాల్లోని పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. తరగతి గదులకు తలుపులు, కిటికీలు అమర్చాలని ఆదేశించారు. స్కూల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండచడంతోపాటు మొక్కలు నాటాలని సూచించారు. కేజీబీవీ ప్రహరీ చుట్టూ బ్లూ షీట్లు అమర్చాలన్నారు. గోకఫసల్‌వాద్ ఉన్నత పాఠశాలకు ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఏఈ నాగేందర్‌కు సూచించారు. బాలంపేటలో నిర్మిస్తున్న పీహెచ్‌సీకి రోడ్డు వేయాలన్నారు. అనంతరం కేజీబీవీ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, తహసీల్దారు గాయత్రి, ఎంఈఓ వెంకటస్వామి, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్
పలు గ్రామాల్లో పాఠశాలల సందర్శన
వసతులు కల్పించాలని ఆదేశం