
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన తప్పనిసరి
తాండూరు టౌన్: పరిసరాల పరిశుభ్రతపై వి ద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పట్టణ మున్సిపల్ డీఈ, ఇంచార్జి కమిషనర్ మణిపాల్ సూచించారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్–2 పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ముఖ్యమన్నారు. ఇళ్లు, పాఠశాల, మైదానం వంటి ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్లల్లోని పూల కుండీల్లో, టైర్లలో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. ఇంటిలోని చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి, మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు. పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి పోయి ప్రజలు అనారోగ్యం పాలవుతారన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగుతూ వ్యక్తిగత, పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవడంతో పాటు ఇంట్లో వారికి, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, సానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్, పాఠశాల హెచ్‌ఎం ప్రతిభా భారతి, వార్డు ఆఫీసర్లు కార్తీక్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
తడి, పొడి చెత్త వేరుచేయాలి
పరిగి: పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు దరిచేరవని మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని గంగపుత్ర కాలనీలో వందరోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీఒక్కరు రోజు తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరుగా వేయాలని సూచించారు. చెత్త సేకరణకు ప్రతి రోజు వాహనాలు వస్తున్నాయని వాటిలోనే చెత్తను వేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ దశరథ్ పాల్గొన్నారు.
తాండూరు మున్సిపల్ డీఈ మణిపాల్

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన తప్పనిసరి