హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్‌

Aug 6 2025 8:23 AM | Updated on Aug 6 2025 8:27 AM

హత్యా

హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్‌

ధారూరు: పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ధారూరు మండలం రాంపూర్‌తండాకు చెందిన సబావత్‌ మోహన్‌పై ఇదే తండాకు చెందిన శంకర్‌, అతని భార్య లక్ష్మీబాయి, కొడుకు రాజేశ్‌ ఈనెల 1న గొడ్డలి, రోకలి, ఇనుప వస్తువులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మోహన్‌ను కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి భార్య సావిత్రీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురిపైనా హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం వీరికి రిమాండ్‌ విధించింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మోహన్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది. ఘటన జరిగిన రోజు మోహన్‌కు చెందిన కోడి, దాని పిల్లలు శంకర్‌ ఇంటివైపు వెళ్లాయి. ఇందులో కొన్ని చనిపోవడంతో.. నోరు లేని కోడి పిల్లలను ఎలా చంపాలనిపించిందంటూ శంకర్‌ కుటుంబ సభ్యులను మోహన్‌ నిలదీశాడు. పాత కక్షలతో కోపోద్రిక్తులైన వారు అతనిపై దాడికి తెగబడ్డారు.

ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలి

ఏడీఏ లక్ష్మీకుమారి

కుల్కచర్ల: ఎరువులను ఎమ్మార్పీ ధరలకంటే ఎక్కువ విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏడీఏ డీఎస్‌ లక్ష్మీకుమారి సూచించారు. మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులకు యూరియా, డీఎపీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. యూరియా కోసం వచ్చిన రైతులకు లేవని చెప్పి పంపిస్తే లైసెన్స్‌లను రద్దు చేస్తామన్నారు. యూరియాలో సన్న రకం, దొడ్డు రకం రెండు ఉన్నాయని రెండింటిలో ఎటువంటి తేడాలు లేవన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

భారీ శబ్దాలతో భయందోళన

తాండూరు రూరల్‌: పెద్దేముల్‌ మండలం సిద్ధన్నమడుగుతండా, ఎర్రగడ్డతండా, ఆత్కూర్‌ గ్రామాల్లో భారీ శబ్దాలతో ప్రజలు భయందోళన చెందారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు భూమి కంపించే విధంగా భారీ చప్పుళ్లు వినిపించాయని తండావాసులు వాపోతున్నారు. ఆత్కూర్‌ గ్రామ శివారులో ఉన్న ఓ క్రషర్‌ మిషన్‌కు సంబంధించి గనులు ఉన్నాయని అక్కడ బ్లాస్టింగ్‌ చేయడంతో శబ్దాలు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దేముల్‌ పోలీసులు మధ్యాహ్నంపర్యటించి అనుమానిత ప్రదేశాలను పరిశీలించారు.

ఈసీవాగులో కూలీ గల్లంతు?

పూడూరు: కంకల్‌ ఈసీ వాగులో ఓ వ్యవసాయ కూలీ గల్లంతైన సంఘటన చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కంకల్‌ గ్రామానికి చెందిన మంగళి సాయన్న(36) వ్యవసాయ కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఈసీ వాగు సమీపంలో ఉన్న పత్తి పొలంలో పత్తి దంతె పట్టేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి తిరిగి పొలానికి వెళ్లే క్రమంలో ఈసీ వాగు ఉధృతి ఎక్కువ కావడంతో అందులో పడి పోయి ఉండవచ్చని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. కాగా సాయన్నకు ఈత రాదు. చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. బాధితుని భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అసత్య వార్తలపై ఫిర్యాదు

దోమ: విధుల్లో ఉన్నా లేనట్లుఅసత్య కథనాలు రాసి, తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మండలంలోని మోత్కూరు అంగన్‌వాడీ టీచర్‌ సువర్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ పత్రికలో అసత్య వార్తలు రాసిన రిపోర్టర్‌పై దోమ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తనపై అవాస్తవాలు చిమ్మిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్‌1
1/3

హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్‌

హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్‌2
2/3

హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్‌

హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్‌3
3/3

హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement