
కూలీల కొరత.. రైతులకు వెత
పరిగి: వర్షాలు సరిగ్గా పడక సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయి. వారం రోజులుగా వానలు లేక పోవడం, బోర్లల్లో నీరు తగ్గడంతో వరినాట్లు వేయాలనుకునే చిన్న, సన్నకారు రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు కూలీల కొరతతో విలవిలలాడే పరిస్థితి నెలకొంది. వర్షాధార పంటలకు కలుపు తీసేందుకు కూలీ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అటు వరి నాట్లు, కలుపుతీత తీసే రైతులు ఒకేసారి పనులు చేయిస్తుండటంతో కూలీల కొరత తీవ్రంగా ఏర్పడింది. వలస కూలీలతో పనులను చేయిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో వరి నాట్లు వేసేందుకు కూలీల రేట్లు రెండింతలు కాగా సాగు పెట్టుబడి కూడా పెరిగింది. సాధారణంగా ఒక్కో కూలీకి రూ.250 నుంచి రూ.300 ఉండగా ప్రస్తుతం రూ.1,000 వరకు తీసుకుంటున్నారు.
దెబ్బతింటున్న పంటలు
జిల్లా వ్యాప్తంగా రైతులు వర్షాధార పంటలపైనే ఆధారం. ఖరీప్ సీజన్‌లో గతేడాది కురిసిన వర్షపాతానికి ఈసారి చాలా తక్కువగా కురిశాయి. అయినా పంటల సాగుపైన దృష్టి సారించారు. వరి నాట్లు వేయడం, పొలాల్లో కలుపు మొక్కలను తొలగించడానికి కూలీలు అవసరం ఏర్పడింది. వరినాట్లు వేసేందుకు పంట పొలాలను సిద్ధం చేసినా కూలీల కొరతతో సమయానికి నాట్లు పడటం లేదని రైతులు దిగులు చెందుతున్నారు. కూలీల కొరత ఒకవైపు భారీగా పెరిగిన కూలీల రేట్లతో కర్షకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అదునుకు కలుపు తీత తీయకపోవడంతో పంటను మించి కలుపు పెరిగిపోతుంది. దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. కొంత మంది రైతులు కూలీలు దొరక్క సాగు చేసిన పంటలో కలుపు తీత తీయకుండా రసాయనాలు పిచికారీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఇప్పటికే వరినాట్లు వేసి కలుపులు తీయాల్సి ఉండగా ఇంకా పూర్తిగా నాట్లే పడలేదు. నారుమళ్లు ముదిరి పోవడంతో పంట దిగుబడిపై దెబ్బపడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీల కొరతతో కలుపు తీసేందుకు, వరి నాట్లు వేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
రెండింతలు పెరిగాయి
కూలీల రేట్లు రెండింతలు కావడంతో పెట్టుబడి కూడా భారీగా పెరుగుతోంది. రేట్లు పెరిగినా కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. గతంలో గ్రామాల్లో కూలీల కొరత ఉండేది కాదు. కాలానుగుణంగా వ్యవసాయ కూలీలు చేసే వారి సంఖ్య భారీగా తగ్గుతుంది. దీంతో డిమాండ్ పెరిగింది.
– రవికుమార్, రైతు మోత్కూర్
కష్టంగా సాగు
పంట సాగు చేయాలంటే కష్టంగా మారింది. వ్యవసాయం చేయడానికి కూలీలు కచ్చితంగా అవసరం. విత్తనాలు విత్తిన నాటి నుంచి కోత నూర్పిడి తదితర పనులకు కూలీలు ఉండాలి. రైతులంతా ఒకేసారి ఒకే పంట సాగు చేయడంతో కూలీల కొరత ఏర్పడుతోంది.
– శ్రీనివాస్, ఐనాపూర్
భారీగా పెరిగిన కూలీ రేట్లు
వరినాట్లకు తీవ్ర ఇబ్బందులు
కలుపుతీతకు రసాయనాల పిచికారీ