
దళితవాడకు అడ్డంగా కంచె
షాద్‌నగర్ రూరల్: తమ కాలనీకి వెళ్లే రోడ్డుకు అడ్డంగా కొందరు వ్యక్తులు కంచె వేశారని ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల దళితవాడకు చెందిన బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తులు, దళితుల కథనం ప్రకారం.. బూర్గుల గ్రామంలోని సర్వేనంబర్ 130లో స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగ్‌రావు స్థానిక అవసరాల నిమిత్తం యాభై ఏళ్ల క్రితం ఎకరా పది గుంటల భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఇది పశువుల మంద స్థలంగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. గ్రామం కోసం కేటాయించిన ఈ భూమిలో కొంతమంది నిరుపేద దళితులు పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన స్థలంలో పంచాయతీ తరఫున బోర్లు వేసి గ్రామానికి నీటి సరఫరా అందించడంతో పాటు పశువుల కోసం నీళ్ల తొట్టి నిర్మించారు. ఇళ్లు కట్టుకున్న దళితులు ఈ భూమిలో నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా సర్వే నంబర్ 130లోని 20 గంటల భూమి మాదేనంటూ బూర్గుల నర్సింగ్‌రావు బంధువు ఆ స్థలం చుట్టూ ఇనుప కంచె వేశారు. దీంతో ఇళ్లకు వెళ్లే దారి లేక ఇబ్బంది పడుతున్నామని దళితులు తెలిపారు. ఇటీవల ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి సంబంధించిన సామాగ్రిని తరలించేందుకు కొంత కంచెను తొలగించాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి బెదించారని తెలిపాడు. బూర్గుల నర్సింగ్‌రావు ఆశయ సాధనకు కృషి చేయాల్సిన వారి కుటుంబ సభ్యులే ఇలా దళితులను చిన్నచూపు చూస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న దారిని మూసేసి కంచె నిర్మించడంపై ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై బాధితులు పోలీసులు, పంచాయతీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం.
రాకపోకలకు అవస్థలు పడుతున్నామని బాధితుల ఆందోళన