లక్ష్యానికి మించి.. | - | Sakshi
Sakshi News home page

లక్ష్యానికి మించి..

Aug 5 2025 10:58 AM | Updated on Aug 5 2025 10:58 AM

లక్ష్

లక్ష్యానికి మించి..

● ఈ ఏడాది సాగు లక్ష్యం 2వేల ఎకరాలు ● ఇప్పటికే టార్గెట్‌ పూర్తి ● ముందుకొచ్చిన 2,300 మంది రైతులు ● 90శాతం రాయితీపై మొక్కలు, డ్రిప్‌ పరికరాలు ● ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా..

వికారాబాద్‌: ఆయిల్‌ పామ్‌ సాగుకు జిల్లా రైతాంగం ఆసక్తి చూపుతోంది. ఈ పంట సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి, లాభాలు ఉండటంతో ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తోంది. భవిషత్‌ అవసరాలు, ఆయిల్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉద్యాన వన శాఖ అధికారులకు లక్ష్యం నిర్ధేశించింది. ఇన్నాళ్లు ఈ పంట సాగుపై రైతులకు అవగాహన లేకపోవడంతో ముందుకు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రోత్సాహం, రాయితీలు కల్పిస్తుండటంతో అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన టార్గెట్‌ను ఉద్యాన వన శాఖ పూర్తి చేసింది. ఇటీవల వికారాబాద్‌ మండలం కొత్రెపల్లి శివారులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ రాష్ట్ర డైరక్టర్‌ హాస్మిన్‌బాషా, డిప్యూటీ డైరక్టర్‌ నీరజ ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటి రైతులకు అవగాహన కల్పించారు.

35వేల ఎకరాల్లో అనుకూలం

జిల్లాలో 5.61 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతుండగా ఇందులో 50 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలను సాగుచేస్తున్నారు. ఆయిల్‌ పామ్‌ సాగు అవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం జిల్లాల వారీగా లక్ష్యాలను విధించింది. వికారాబాద్‌ జిల్లాలో 35 వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నాయని ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఏడాది జిల్లాలో కనీసం 2వేల ఎకరాల్లో పంట సాగు చేయాలని లక్ష్యం పెట్టుకొగా అది పూర్తయ్యింది. 2వేల మంది రైతులు సాగుకు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. లక్ష్యానికి మించి మరో 300 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు.

రాయితీతో..

ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. ఐదెకరాల వరకు సాగుచేసే సన్న, చిన్నకారు రైతులకు 90శాతం రాయితీపై మొక్కలు అందజేయనుంది. 90శాతం రాయితీపై డ్రిప్‌పైపులు కూడా అందజేస్తారు. పంట దిగుబడి ప్రారంభమయ్యే వరకు అంతర పంటలు సాగుకు ఎకరాకు ఏడాదికి రూ.2100 చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు మొక్కలతోపాటు డ్రిప్‌ పరికరాలను ఉచితంగా ఇస్తారు. 9 ఎకరాల నుంచి 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేసే రైతులకు 80 శాతం రాయితీ ఇవ్వనున్నారు.

ఏడాదికి రూ.2.5 లక్షల ఆదాయం

ఆయిల్‌పామ్‌ దీర్ఘకాలిక పంట. మూడున్నర సంవత్సరాల నుంచి పంట ప్రారంభమై ఐదు సంవత్సరాలకు అమ్మాకినికి వస్తుంది. అప్పటి నుంచి 35 సంవత్సరాల పాటు ఏడాదికి ఎకరాకు 10 నుంచి 16 టన్నుల దిగుబడి వస్తుంది. దాదాపు రూ.2.5 లక్షల ఆదాయం చేకూరుంది. ఎకరం పొలంలో 57 మొక్కలు మాత్రమే నాటుకోవాల్సి ఉంటుంది. అంతర పంటలుగా శ్రీగంధం, సర్వి, ఉల్లి, కూరగాయల పంటలు సాగు చేసుకోవచ్చు.

ఇటీవల కొత్రెపల్లిలో ఆయిల్‌ పామ్‌ మొక్క నాటుతున్న మంత్రి తుమ్మల, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

దరఖాస్తు చేసుకోవాలి

ఆయిల్‌ పామ్‌ సాగుపై అసక్తి గల రైతులు తమను సంప్రదించి దరఖాస్తూ చేసుకోవాలి. రైతు వాటా ఎకరాకు రూ.1,750 చొ ప్పున ఎన్నిఎకరాలు ఉంటే అంత డబ్బు డీడీ రూపంలో తీసి ఇవ్వాలి. నీట సౌకర్యం ఉన్న రైతులే దరఖాస్తు చేయాలి.తాండూ రు సమీపంలోని కోకట్‌ నర్సరీలో మొక్కలు అందుబాటులో ఉన్నాయి. పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే కంపెనీలతో రైతులను టయ్యప్‌ చేస్తాం.

– సత్తార్‌, జిల్లా ఉద్యాన శాఖ అధికారి

లక్ష్యానికి మించి..1
1/1

లక్ష్యానికి మించి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement