సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Aug 5 2025 10:58 AM | Updated on Aug 5 2025 10:58 AM

సర్వం

సర్వం సిద్ధం

● చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు పూర్తి ● ప్రభుత్వానికి చేరిన అంచనాలు ● ఉత్తర్వులు రావడమే ఆలస్యం ● జిల్లాలో మొత్తం చెరువులు 1,179 ● ఎంపిక చేసినవి 778 ● వదలాల్సిన చేపపిల్లలు 1.29 కోట్లు ● మత్స్య సహకార సంఘాలు 152

వికారాబాద్‌: జిల్లాలోని చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదిలేందుకు మత్స్య శాఖ కసరత్తు చేస్తోంది. వందశాతం రాయితీతో ప్రభుత్వం వీటిని పంపిణీ చేస్తుంది. ఇటీవల ఇందుకు సంబంధించిన నిధులు కేటాయించినా ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు. ఏ సమయంలోనైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. చేప పిల్లలు వదిలేందుకు అనువైన చెరువులను ఎంపిక చేశారు. ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసిన ఆ శాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అంజేశారు. ప్రస్తుతం టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే ఎప్పటిలోగా చేపపిల్లలు వదులుతారనే విషయంపై స్పష్టత లేదు. జిల్లాలో మొత్తం 1,179 చెరువులు, కుంటలు ఉండగా 778 చెరువుల్లో చేపపిల్లలు వదలాలని నిర్ణయించారు. ఈ ఏడాది 1,29,72,000 చేప పిల్లలు, 14.97 లక్షల రొయ్య పిల్లలు వదలాలని లక్ష్యం పెట్టుకున్నారు. జిల్లాలో 152 మత్స్య సహకార సంఘాలు.. 5,665 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో ఈ నెల నుంచే చేప పిల్లలు వదిలే ప్రక్రియ ప్రారంభించాలని మత్స్య సహకార సంఘాల సభ్యులు కోరుతున్నారు. అలాగే చెరువులకు సరిపడా చేప పిల్లలు పంపిణీ చేయాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

లక్ష్యానికి దూరంగా..

చెరువుల్లో చేపపిల్లలు వదిలే విషయంలో అధికారులు ఎంచుకున్న లక్ష్యానికి వదులుతున్న దానికి ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. ఏటా ఇదే తంతు కనిపిస్తోంది. ఎంచుకున లక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకే చేపపిల్లలు వదిలి చేతులు దులపుకొంటున్నారు. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో చెరువులు పూర్తి స్థాయిలో నిండేవి. ఈ ఏడాది ఇప్పటికే అన్ని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ ప్రక్రియను ప్రారంభించపోవడంతో చాలా మంది మత్స్యకారులు బయట కొనుగోలు చేసి చెరువుల్లో వదులుకోవాల్సి వస్తోంది.

నాసిరకం పిల్లలు

ఏటా ప్రభుత్వం వదులుతున్న చేపపిల్లల్లో ఎక్కువ శాతం నాసిరకంగానే ఉంటున్నాయి. సాధారణంగా చెరువుల్లో వదిలే సమయంలో మూడు నుంచి నాలుగు ఇంచులు ఉండాలి. కానీ ఒక్క ఇంచుకు మించి ఉండటం లేదు. గతేడాది దోమ మండలం మోత్కూర్‌ చెరువులో చేపపిల్లలు వదిలేందుకు అధికారులు వచ్చారు. నాసిరకంగా ఉండటంతో మత్స్యకారులు అధికారులతో గొడవకు దిగారు. నాలుగు సార్లు చేప పిల్లలను తిరిగి పంపారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేప పిల్లల లెక్కల్లో తేడా ఉందని అంటున్నారు. లక్ష పిల్లలు వదిలామని చెబుతున్నా అందులో 50 వేలు కూడా ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు దృష్టిసారించి నాణ్యమైన చేపపిల్లలు వదలడంతోపాటు లెక్క కూడా సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

ఉత్తర్వులు రాగానే..

జిల్లాకు ఎన్ని చేపపిల్లలు అవసరం అనే దానిపై అంచనాలు సిద్ధం చేశాం. ప్రభుత్వానికి నివేదిక కూడా పంపాం. ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నాం. ఆదేశాలు అందిన వెంటనే టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదులుతాం.

– వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి

సర్వం సిద్ధం1
1/1

సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement