
నాణ్యమైన విద్యనందించాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● వికారాబాద్, మోమిన్‌పేట్ జూనియర్ కళాశాలల్లో తనిఖీ
అనంతగిరి/మోమిన్‌పేట్: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ లెక్చరర్లకు సూచించారు. సోమవారం వికారాబాద్, మోమిన్‌పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఏఏ సబ్జెక్టులు ఎంత వరకు పూర్తయ్యాయని ఆరా తీశారు. ఆతర్వాత సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పెండింగ్ పనులు ఉంటే సత్వరం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆదేశించారు. అనంతరం మోమిన్‌పేట్ పశువైద్యశాలను తనిఖీ చేశారు. ఒక్కరే విధుల్లో ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎన్.శంకర్ నాయక్, వికారాబాద్‌ఎంపీడీఓ వినయ్ కుమార్, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు, మోమిన్‌పేట్ ఎంపీడీఓ విజయలక్ష్మి, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.
సత్వరం పరిష్కరించాలి
ప్రజా ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 147 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.