
వర్షాభావం కారణంగా భారీగా తగ్గిన వరిసాగు
● నిండని చెరువులు..పెరగని భూగర్భజలాలు ● నెలాఖరు వరకు సమయం ఉందంటున్న శాస్త్రవేత్తలు ● శాస్త్రీయ పద్దతులు పాటించాలని వ్యవసాయ శాఖ సూచన
ఈ ఏడాది ఖరీఫ్(వానాకాలం) రైతులకు నిరాశే మిగుల్చుతోంది. గతేడాది 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ ఏడాది నేటికీ 40 వేల ఎకరాలకే పరిమితమైంది. జిల్లాలో మెజార్టీ స్థాయిలో చెరువులు నిండక.. భూగర్భ జలాలు పెరగక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
వికారాబాద్: ఈ ఏడాది వరి సాగుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వర్షాకాలంలో వచ్చిన మార్పులతో ఈ ఏడాది సాగు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలోనే అత్యధికంగా పరిగి నియోజకవర్గంతో పాటు వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని ధారూరు, కొడంగల్ పరిధిలోని బొంరాస్‌పేట్, దౌల్తాబాద్, దుద్యాల, తాండూరు పరిధిలోని యాలాల మండలాల్లో వరి అత్యధికంగా సాగు చేస్తారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 93 వేల ఎకరాలు కాగా గత నాలుగేళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది చెరువుల్లోకి నీరు పూర్తి స్థాయిలో చేరకపోవడంతో గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 1,187 చెరువులకు గాను 62 చెరువులు అలుగు పారుతుండగా మరో 194 చెరువులు 75 శాతం నుంచి వందశాతం నిండాయి. మిగతా చెరువులు ఇంకా నిండలేదు. భూ గర్భ జలాలు సైతం పెరగలేదు.
ఆందోళనలో అన్నదాత
సరిపడా వర్షాలు కురవక రైతులు వరి నాట్లు వేసుకునేందుకు వెనుకాడుతున్నారు. రైతులంతా నారు పోసుకున్నా సగం కంటే తక్కువ మంది నాట్లు వేస్తున్నారు. బోర్లు ఉన్న రైతులు నాట్లు వేస్తున్నప్పటికీ నీరు అడుగంటడంతో పంటలు పండుతాయా.. ఎండుతాయా..? అని ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం ఈ నెలాఖరు వరకు వరి నాట్లు వేసుకోవచ్చని సూచిస్తున్నారు. తమ సలహాలు, సూచనల మేరకు సాగు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చునని అవగాహన కల్పిస్తున్నారు.
శాస్త్రవేత్తల సూచనలు
● బీపీటీ 5204, ఎంటీయూ 1010, ఎంటీయూ 1001, చిట్టిముత్యాలు తదితర రకాలవరివిత్తనాలు సాగుచేస్తున్నారు.
● సాంబమసూరి, భరణి, కాటన్ దొర సన్నాలు, సోమశిల, సింహపురి, తెలంగాణ సోనా రకాలను వానాకాలం సీజన్‌లో సాగుచేస్తే మంచి దిగుబడులు వస్తాయి.
● ఈ రకాలు ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తుంది. యాసంగిలో మరో పది బస్తాల వరకు పెరుగుతాయి.
● ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న ఎంటీయూ 1010, ఎంటీయూ 1001 రకాలు యాసంగిలో మంచి దిగుబడులు ఇస్తాయి.
● సెప్టెంబర్ మొదటి వారంలోపు వరినాట్లు వేసుకోవటం మంచిది.
జాగ్రత్తలు
● వరి పంటను కాండం తొలుచు పురుగు, ఆకుముడత తెగులు, దోమపోటు, అగ్గితెగులు ఆశించే అవకాశాలు ఎక్కువ.
● కాండం తొలుచు పురుగు నివారణకు నారు మళ్లలో ఒకటిన్నర కిలోల గుళికల మందు చల్లుకోవాలి.
● నాట్లు వేశాక 20 రోజులకు ఎకరానికి 8–10 కిలోల వాసన రాని గుళికల మందు వేసుకోవాలి.
● ఆకుముడత తెగులు నివారణకు కోలరోపైరిపాస్ లేదా మోనొ క్రొటోపాస్ మందు పిచికారీ చేసుకోవాలి.
● దోమపోటు నివారణకు ఇమిడా క్లోరోఫిడ్, అగ్గి తెగులు నివారణకు ట్రై సోక్లోజోన్ మందులను పిచికారీ చేసుకోవాలి.
● ఈ మందులన్నీ సూచిచించిన మోతాదు మేరకే వాడాలి.
అందుబాటులో ఎరువులు
రైతులు అధిక మోతాదులో ఎరువులు వాడుతున్నారు. దీంతో అనర్థాలు ఎక్కువ. యూరియా ఎక్కువగా వా డడంతో పైరు ఏపుగా పెరగి పచ్చగా మారడంతో పంటను ఆశించే పురుగులు, చీడపీడల శాతం పె రిగి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. జిల్లాలో రై తులకు సరిపడా ఎరువులు అందుబాటు ఉంచాం.
– రాజారత్నం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి