
అవగాహన లేక.. అందిపుచ్చుకోక!
మోమిన్‌పేట: వ్యవసాయంలో యూరియాకు బదు లు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సూచిస్తున్నా దాని అమలుకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. కేంద్ర సర్కారు రెండేళ్ల క్రితమే ప్రతిష్టాత్మకంగా నానో యూరియా, నానో డీఏపీలను(ద్రవ రూపం) విడుదల చేసినా దానిపై అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలమైంది. దీని ఫలితంగా ప్రస్తుతం రైతులు యూరియా బస్తాల కోసం ఫర్టిలైజర్ షాపుల ఎదుట బారులు తీరు తున్న ఘటనలు ఉన్నాయి. నానో యూరియాపై సమగ్రంగా అవగాహన కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.
పంటలకు సోకిన తెగుళ్లు
పత్తిలో వచ్చే తెగుళ్లు, పెను బంక, నల్ల, తెల్ల పెనులు వచ్చి పంటను ఎదగకుండా నాశనం చేస్తుంటే రైతులు వ్యవసాయాధికారులను సంప్రదించడం మానేసి ఎరువుల షాపులను ఆశ్రయిస్తున్నారు. వ్యవసాయాధికారులు పంటలపై వచ్చే తెగుళ్లు నివారణపై అవగాహన కల్పించడం లేదని స్పష్టంగా తెలుస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఏదో ఏ పని ఉందని కార్యాలయాలు మాత్రం దాటడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయాధికారులు విత్తనాలు విత్తుకొన్నది మొదలు పొలం బాట పట్టితే రైతుల సమస్యలు అర్థమవుతాయని అంటున్నారు. గత వారంలో అధికంగా కురిసిన వర్షాలకు పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో కొన్ని పంటలకు తెగుళ్లు సోకగా రైతులు మందుల దుకాణం యాజమానులను సంప్రదించారు.
రైతుల ఆగ్రహం
ముఖ్యంగా యూరియా కోసం నిత్యం రైతులు ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. నానో యూరియా, నానో డీఏపీలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు కార్యాలయాలు దాటడం లేదు. రవాణా ఖర్చు, దూర భారం, ఏ మందులోనైనా కలిపి పిచికారీ చేసుకోవడం, ఒక బస్తా యూరియాకు ఒక లీటరు నానో యూరియా సమానమని రైతులకు అవగాహన కల్పిస్తే ఇబ్బందులు తప్పుతాయి. కానీ అధికారులు ఆ విధంగా ఆలోచించడం లేదని ఆరోపణలున్నాయి. ఎప్పుడు చూసిన వ్యవసాయాధికారులు కార్యాలయంలోనే ఉండటాన్ని రైతులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు పొలం బాట పట్టి రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించాలని కోరుతున్నారు.
నానో యూరియా, డీఏపీ వినియోగంపై నీలినీడలు
క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారుల అలసత్వం

అవగాహన లేక.. అందిపుచ్చుకోక!