
సమానత్వమే సనాతన ధర్మం
తాండూరు టౌన్: సమానత్వమే సనాతన ధర్మమని శ్రీమాణికేశ మహాసంస్థానం ఆశ్రమ పీఠాధిపతి, విశ్వహిందూ పరిషత్ ప్రాంత సామాజిక సమరసత మార్గదర్శకులు శ్రీ శంకర్ స్వామీజీ అన్నారు. ఆదివారం ఆయన తాండూరు పట్టణంలోని అంబేడ్కర్ నగర్ సేవా బస్తీ, దళిత వాడలోని మునింగం లాలప్ప గృహంలో రుద్రాభిషేకం, మహా హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం అడ్డు గోడలను కూలుస్తూ, హిందువులను ఏకం చేయడం కోసం, అందరిలో సోదర భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గడప లోపలే కులం, గడప దాటితే హిందూ బంధువులం అనే భావనను ప్రజలంతా కలిగి ఉండాలన్నారు. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, అందరిలో ఆధ్యాత్మిక భావనను జోడించేందుకే ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. అనంతరం దంపతులకు శివలింగం, సంస్థానం తరుఫున అమ్మవారి వస్త్రాలు అందజేశారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని బస్తీలో రాఖీలు కట్టారు.
శ్రీమాణికేశ మహాసంస్థానం ఆశ్రమ పీఠాధిపతి శంకర్ స్వామీజీ