
కళాశాల కలను సాకారం చేస్తాం
● స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
● లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ
ధారూరు: మండల ప్రజల చిరకాల వాంఛ జూనియర్ కళాశాల అని దాన్ని అతి త్వరలో సాకారం చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం ధారూరు రైతు వేదికలో కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట్‌పల్లి వద్ద ఏర్పాటు చేయనున్న 220 కేవీ సబ్ స్టేషన్ ధారూరు మండలానికి కూడా ఉపయోగ పడుతుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద వికారాబాద్ నియోజకవర్గానికి రూ.15 కోట్లు తెచ్చానని, అందులో రూ.6 కోట్లు వెనక్కి వెళ్లినట్లు తెలిపారు. ప్రతిపాదనలు పంపితే ఆ నిధులు వచ్చేలా చూస్తానని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరును చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలను సీఎం రేవంత్‌రెడ్డి సాకారం చేస్తున్నరని తెలిపారు. మండలానికి 451 కొత్త రేషన్‌కార్డులు మంజూరైనట్లు చెప్పారు. కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూనే రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రం మనదే అన్నారు. దెబ్బతిన్న రోడ్లను రూ.600 కోట్లతో బాగుచేయిస్తున్నట్లు వివరించారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 8 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సుదర్శనమ్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, తహసీల్దార్ సాజిదాబేగం, డీటీ విజయేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్, ఏఎంసీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, ఎంపీడీఓ నర్సింహులు, నాయకులు రాములు, కిరణ్, మహ్మద్ బాబాఖాన్, హన్మయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు బంట్వారానికి స్పీకర్ రాక
బంట్వారం: మండల కేంద్రమైన బంట్వారానికి శనివారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అధికారులు, పార్టీ నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు.
కుర్మ సంఘం భవనానికి శంకుస్థాపన
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బిల్లదాకలలో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించే కుర్మ సంఘం భవనానికి శుక్రవారం స్పీకర్ ప్రసాద్‌కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణానికి ఎస్‌డీఎఫ్ నిధులు నుంచి రూ.కోటి మంజూరు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, గొర్రె కాపరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సదానందం, పీఆర్ ఈఈ ఉమేష్‌కుమార్, ఆర్‌టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.