
నిర్వాసితులకు న్యాయం చేస్తాం
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్‌లో వెలసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇళ్లు, ఇంటి స్థలాలు కోల్పోతున్న వారందరికీ న్యాయం చేస్తామని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ హామీ ఇచ్చారు. శుక్రవారం పట్టణంలోని కడా కార్యాలయంలో నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విస్తరణలో భాగంగా ఆలయం చుట్టూ ఉన్న ప్రైవేటు స్థలాన్ని సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. 96 మంది నుంచి 8,736 గజాల స్థలం సేకరించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వాసితుల అభిప్రాయాలు సేకరించారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇల్లు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లిస్తామన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు ఇంటి విలువను లెక్క కడతారని తెలిపారు. స్థలం, భవనం విలువ లెక్క కట్టి పరిహారం చెల్లిస్తామన్నారు. దీనికి అదనంగా రూ.5 లక్షల సాయం, ఒక ఏడాది కుటుంబ అవసరాల కోసం రూ.40 వేలు, ఇల్లు ఖాళీ చేసి వెళ్లడానికి అయ్యే ఖర్చు (ట్రాన్స్‌పోర్ట్)రూ.60 వేలు, పశువుల దొడ్డి నిర్వహణకు రూ.25 వేలు, చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి రూ.30 వేలు, ఇతర ఖర్చుల కోసం రూ.60 వేలు చెల్లిస్తామన్నారు. పట్టణంలోని జాతర స్థలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెంచర్‌లో ఇంటి స్థలం కేటాయిస్తామని, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషన్ బలరాం నాయక్, ఆలయ ఈఓ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ, ఆలయ ధర్మకర్తలు నందారం శ్రీనివాస్, రత్నం, మధు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విస్తరణకు సర్కారు సానుకూలత
పేదల తిరుపతిగా పేరుగాంచిన వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ సానుకూలంగా ఉంది. ఆలయాన్ని విస్తరించి మౌలిక సదుపాయాలు కల్పించడానికి టీటీడీ తోపాటు రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆలయ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, మాఢ వీధుల విస్తరణపై దృష్టి పెట్టారు. క్యూ లైన్, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, భక్తుల సౌకర్యార్థం స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర వాటిని నిర్మిస్తారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, ఎండోమెంట్ కమిషనర్ వెంకట్‌రావు, వాస్తు నిపుణుడు సపథి, ఇతర ఉన్నతాదికారులు శనివారం కొడంగల్ శ్రీవారి ఆలయానికి రానున్నట్లు ఆలయ ఈఓ రాజేందర్‌రెడ్డి తెలిపారు.
ఇళ్లు కోల్పోయే వారికి స్థలం.. పరిహారం చెల్లిస్తాం
కొడంగల్ శ్రీవారి ఆలయ విస్తరణకు సహకరించాలి
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
నేడు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాక