
నాణ్యత నై..!
వికారాబాద్: పై ఫొటోలో కనిపిస్తున్న బ్రిడ్జి యాలాల మండల పరిధిలో తాండూరు – కొడంగల్ మార్గంలో తొమ్మిదేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏడేళ్ల పాటు పనులు కొనసాగుతూ వచ్చాయి. రూ.16.80 కోట్లు వెచ్చించి రెండేళ్ల క్రితం (2022 చివరి నాటికి) పూర్తి చేశారు. నాటి నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల క్రితం బ్రిడ్జికి రంధ్రం పడింది. వందేళ్లపాటు ఉండాల్సిన వంతెన రెండేళ్లకే పాడవడం అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో ఇట్టే అర్థం అవుతుంది. దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించి అధికారులు మరమ్మతులు చేయలేదు. బ్రిడ్జి నాణ్యతపై పూర్తి స్థాయి విచారణ జరిపించడంతోపాటు సంబంధిత కాంట్రాక్టర్, పర్యవేక్షించిన ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పక్క ఫొటోని వంతెనను ఒక్కసారి పరిశీలిస్తే పనుల్లో నాణ్యత ఏ మేరకు పాటిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పన క్కర్లేదు. తాండూరు డివిజన్ పరిధిలోని పెద్దేముల్ మండల కేంద్రానికి కిలో మీటరు దూరంలో గాజీపూర్ –బుద్దారం మార్గంలో రూ.3.30 కోట్లు వెచ్చించి ఈ వంతెన నిర్మించారు. ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభించి ఏడాదిన్నర క్రితం(2023 చివరి నాటికి) అందుబాటులోకి తెచ్చారు. కనీసం ఏడాది తిరక్కుండానే పాడైంది. బ్రిడ్జి మొత్తం సిమెంట్ ఊడిపోయి లోపలి స్టీల్ కనిపిస్తోంది. ఇవి ఉదాహరణకు మాత్రమే. జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన చాలా వంతెనలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి.