
పేరుకే పైలెట్ ప్రాజెక్ట్
కొందుర్గు: ధరణి లోపాలను సరిదిద్దుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంతోనైనా తమ సమస్యలు తీరుతాయని ఆశించిన రైతుల కల లు కల్లలయ్యాయి. ఈ ఏడాది జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందని చెప్పిన పాలకుల ప్రసంగాలు విని సంతోషించారు. ప్రభుత్వం జిల్లా లో కొందుర్గు మండలాన్ని పైలెట్‌గ్రామంంగా ఎంపిక చేసింది. దీంతో మే 30న నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ప్రసంగిస్తూ మండలంలో భూ సమస్యలన్నింటికి పరిష్కారం చూపి రోల్‌మోడల్‌గా నిలపాలని అధికారులకు సూచించడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సదస్సులు పూర్తయి రెండు నెలలు గడిచినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చందగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్‌కు విన్నవించినా కదలని ఫైల్
భూభారతి అవగాహన సదస్సులో భాగంగా మండల కేంద్రానికి వచ్చిన కలెక్టర్ నారాయణ రెడ్డికి పలువురు రైతులు తమ సమస్యలు వివరించారు.
● కొందుర్గు తూర్పు, పడమర రెండు రెవెన్యూ గ్రామాలుగా ఉండడంతో తమ భూములు నిషేధిత జాబితాల్లో చేరాయని గ్రామానికి చెందిన పెరుమాళ్ల శేఖర్ ఫిర్యాదు చేశారు.
● చెర్కుపల్లిలో 48 మంది భూములు అకారణంగా నిషేధిత జాబితాలో పడ్డాయని పీఏసీఎస్ చైర్మన్ దామోదర్‌రెడ్డి వాపోయారు.
● 1954 ఖాస్రా పహణి రికార్డుల ప్రకారం చెర్కుపల్లికి చెందిన సర్వే నంబర్లు 119, 260, 271, 272, 274, 277, 280, 281, 282, 295లలో 79 ఎకరాల విస్తీర్ణం ఉన్న భూమి వేంకటేశ్వర స్వామి ఆలయం పేరిట పట్టా చేశారు.
● 1958లో భూములను రీ సర్వేచేయడంతో శివారులోని 1, 2, 4, 12, 67, 100, 107, 108, 146, 147, 148, 158, 159, 172, 318, 348, 252, 354, 357, 358, 359 లలో విస్తీర్ణం 79 ఎకరాల భూమిని వెంకటేశ్వరస్వామి పేరున పట్టా మార్చారు.
ఆగం చేసిన ధరిణి పోర్టల్
ధరణి పోర్టల్ ఏర్పాటు సయమంలో రీసర్వేకు ముందు, తర్వాత మొత్తంగా 158 ఎకరాలను ఆలయ భూమిగా చూపుతూ నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో 48 మంది రైతులకు చెందిన భూములు నిషేధిత జాబితాలో చేరాయి. ఈ విషయమై బాధిత రైతులు తహసీల్దార్, ఆర్‌డీఓ, కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా సమస్యల పరిష్కారం అవ్వలేదు. ఇందుకు స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు పూర్తైన వెంటనే సమస్యలన్నింటికి పరిష్కారం చూపుతాం. కొందుర్గును రాష్ట్రానికే దిక్చూచిగా మార్చుతాం అంటే సంతోషపడ్డారు. కానీ నేటికి సమస్యలు తీరలేదు.
పేరుకుపోయిన సమస్యలు
భూ భారతిలోనూ ధరణి తప్పిదాలు
ఇదేనా రోల్‌మోడల్ అంటూ రైతుల అసహనం
రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు
మొత్తం దరఖాస్తులు 573
అమోదం పొందిన దరఖాస్తులు 38
ఆర్డీఓ కార్యాలయంలో పెండింగ్ 56
అడిషనల్ కలెక్టర్ వద్ద పెండింగ్ 70
రిజెక్ట్ అయిన దరఖాస్తులు 120
సమస్య తీరేలా లేదు
తాతల కాలం నుంచి పట్టా భూములు సాగుచేసుకుని బతుకుతున్నాం. తమకు ఆపద వచ్చి ఓ గుంట భూమిని అమ్ముకుందామని వెళితే మీ భూములు దేవుడి పేరున ఉన్నాయి. అమ్మడానికి వీలుకాదని అధికారులు చెబుతున్నారు. భూ భారతి చట్టంతోనైనా మా సమస్య తీరుతుంది అనుకున్నాం. కాని ఏమి లాభం లేదు. మేము సచ్చినా సమస్య తీరేలా లేదు.
– వడ్డె చంద్రయ్య, రైతు, గంగన్నగూడ
త్వరలో పరిష్కారం
వీలైనంత త్వరలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఇప్పటికే దాదాపు సమస్యలకు పరిష్కారం చూపాం. వివిధ స్థాయిల్లో కొన్ని ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే పరిష్కారం కావచ్చు.
– రమేశ్ కుమార్, తహసీల్దార్, కొందుర్గు

పేరుకే పైలెట్ ప్రాజెక్ట్

పేరుకే పైలెట్ ప్రాజెక్ట్