
ఆదరణేది!
కొడంగల్: గత ప్రభుత్వం రవాణా సౌకర్యం మెరు గు పరిచేందుకు 11 బస్సులతో కోస్గి ఆర్టీసీ డిపోను ప్రారంభించింది. నాడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ డిపోను ప్రారంభించారు. ఏళ్లు దాటినా బస్సు సర్వీసులు పెంచకుండా అరకొర బస్సులతోనే నిర్వహణ కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్, తాండూరు ప్రధాన రూట్లలో సరిపడా సర్వీసులు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఉన్న బస్సులు సైతం ఎప్పుడు ఎక్కడ ఆగుతాయో తెలియని పరిస్థితి.
మూడేళ్ల క్రితం మరోసారి ప్రారంభం
గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల క్రితం రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి డిపో ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికై నా గ్రామాలకు బస్సులు వస్తాయని ఆశించిన నియోజకవర్గ ప్రజలు ఆశించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్‌రెడ్డి కోస్గి డిపోకు కొత్తగా బస్సులు కేటాయించి హైదరాబాద్‌కు నడిపిస్తున్నారు. పల్లెలకు బస్సుల సౌకర్యం లేక ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు.
సౌకర్యాల లేమి
● డిపో ఏర్పాటు చేసినా డిపో మేనేజర్ నియామకం చేపట్టలేదు
● డిపోలో కనీస సౌకర్యలు కల్పించలేదు.
● బస్సులను శుభ్రం చేసేందుకు స్టాండ్ ఏర్పాటు చేయలేదు.
● డిపోలే డీజిల్ ఫిల్లింగ్ సౌకర్యం ఏర్పాటుకు నోచుకోలేదు.
● పూర్తిస్థాయి మెకానిక్‌లు నియమించలేదు.
● సిబ్బంది నియామకం నామమాత్రమే
పాఠశాలలకు ఆలస్యం
ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజక వర్గంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాండూరు, మహబూబ్‌నగర్ లాంటి పట్టణాలకు ఒకేసారి ఒకే సమయంలో ఐదారు సర్వీసులు నడుపుతున్నారు. ఆ బస్సులు వెళ్లాయంటే మళ్లీ గంట వరకు బస్సులు రావడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రార్థనకు ఆలస్యంగా వెళ్లడంతో టిఫిన్స్ అందడం లేదు. పాఠశాల సమయానికి విద్యార్థుల కోసం ప్రత్యేక సర్వీసులు వేయాలని డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక ఎంఈఓ రాంరెడ్డి ఆరోపించారు. రుద్రారం, నీటూరు, అప్పాయిపల్లి, చిట్లపల్లి, సంగాయిపల్లి, అంగడిరాయిచూర్, లక్ష్మీపల్లి, టేకుల్‌కోడ్, అన్నారం, నాగారం, ధర్మాపూర్, పాటిమీదిపల్లి గ్రామాల విద్యార్థులకు ప్రతి రోజూ ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.
విస్తరణకు నోచుకోని కొడంగల్ బస్టాండ్
1979 అక్టోబర్ 24 అప్పటి రవాణా శాఖ మంత్రి వెంగళ్‌రావు శంకుస్థాపన చేసిన కొడంగల్ బస్టాండ్‌ను 1981 డిసెంబర్ 19న అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య, రవాణా శాఖ మంత్రి రోశయ్య ప్రారంభించారు. నాటి నుంచి ఈ బస్టాండ్ విస్తరణకు నోచుకోలేదు. కొడంగల్ నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం లేదు. వికారాబాద్‌కు వెళ్లాలంటే రెండు బస్సులు మారాల్సిందే. వికారాబాద్ వెళ్లాలంటే పరిగి మీదుగా నుంచి 52 కిలోమీటర్లు, తాండూరు మీదుగా 63 కిలోమీటర్ల ప్రయాణించాల్సిందే.
కోస్గి డిపోపై పాలకుల నిర్లక్ష్యం
బస్సు సర్వీసులు లేక ప్రజల ఇబ్బందులు
పాఠశాల సమయానికి చేరుకోలేకపోతున్న విద్యార్థులు