
● ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి ● తాండూరు మున్సిపల్
తాండూరు: ప్రజల భాగస్వామ్యంతోనే తాండూరు మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో కొనసాగుతోందని మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి అన్నారు. శుక్రవారం సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను స్థానికులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. వాటిని సావధానంగా ఆలకించిన ఆయన వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డీఈఈ మణిపాల్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉమేష్, ఆర్‌ఐలు అశోక్, రమేష్, టీపీపీఓలు శాంతిప్రియ, నరేష్, వంశీ, టీఎంసీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ప్రశ్న: మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో రోడ్డుపైనే చెత్త వేస్తున్నారు. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. పాత తాండూరులోని హనుమాన్ ఆలయం వద్ద కాలువల్లో మురుగు తీయడం లేదు. ఉన్న కాల్వలు ధ్వంసమయ్యాయి. దోమల బెడద ఎక్కువగా ఉంది. వెంటనే చర్యలు తీసుకోవాలి.
– నారా రాకేష్, పాతతాండూరు
కమిషనర్: మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రోడ్లపై చెత్త వేయకుండా ముగ్గులు వేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు కూడా సహకరించాలి. దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: 12వ వార్డులో పార్కులు అధ్వానంగా మారాయి. పిల్లలు ఆడుకునేందుకు వీలులేకుండా పోయింది. పార్కు స్థలంలో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. వీధి దీపాలు సైతం వెలగడం లేదు. 28వ వార్డులోని శాంతినగర్ పార్కు అధ్వానంగా ఉంది.వాటిని బాగు చేయాలి.
– మేరి విజయకుమార్, 12వ వార్డు,
జమీర్, 28వ వార్డు తాండూరు
జవాబు: త్వరలో పట్టణంలోని పార్కులనుసందర్శించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. పార్కు స్థలంలో కార్లు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. పార్కుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి త్వరలోపనులను ప్రారంభిస్తాం.
ప్రశ్న: 35వ వార్డులో మురుగు కాల్వలను శుభ్రం చేయడం లేదు. దీంతో దుర్వాసన, దోమలు వృద్ధి చెందుతున్నాయి. వీధి దీపాలు కూడా వెలగడం లేదు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
– సురేష్, తాండూరు
జవాబు: పారిశుద్ధ్య సిబ్బందిని పంపి మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తెస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న:10వ వార్డులోని ప్రభుత్వ నంబర్ వన్ పాఠశాల వద్ద వీధి దీపాలు వెలగడం లేదు. మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. సాయిపూర్ రోడ్లులో చెత్త వేస్తున్నారు. హనుమాన్, కట్ట మైసమ్మ ఆల యాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదు.
– శివ, 10వ వార్డు, తాండూరు
జవాబు: పాఠశాల వద్ద వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. రోడ్లపై చెత్త వేయరాదని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదు. ఆలయాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపడతాం.
ప్రశ్న: వార్డు నంబర్ 31.. రైల్వే స్టేషన్ రోడ్డు మార్గంలో చెత్తాచెదారంపేరుకుపోయింది. డీఎస్పీ కార్యాలయం వద్ద మురుగు కాల్వను శుభ్రం చేయడం లేదు. రెండు రోజులకు ఒక్కసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు.
– అమ్జాద్ అలీ, అహ్మద్‌పాషా, తాండూరు
జవాబు: ఇళ్ల ముందు మురుగు కాల్వలను మూసి వేయడంతో సమస్య వస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాల్వలపై నిర్మించిన కట్టడాలని తొలగించాలి. అప్పుడే సమస్యపరిష్కారమవుతుంది. ఆ దిశగా ప్రజలకు అవగహన కల్పిస్తాం.
ప్రశ్న: పాత తాండూరులోని 18వ వార్డులో మురుగు కాల్వలు లేవు. ఉన్నవి దెబ్బతిన్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలి.
– జావీద్, పాత తాండూరు
జవాబు: వార్డులో మురుగు కాల్వల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.

● ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి ● తాండూరు మున్సిపల్

● ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి ● తాండూరు మున్సిపల్