
వడ్డీ తిరిగొచ్చింది!
వికారాబాద్: ప్రభుత్వం ఎట్టకేలకు మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ నిధులు విడుదల చేసింది. 2023 మార్చి నుంచి 2025 మార్చి వరకు రెండేళ్ల పాటు సభ్యులు బ్యాంకులకు చెల్లించిన మొతాన్ని విడు దల చేసింది. తొలుత 22 నెలలకు సంబంధించిన డబ్బులు మంజూరవగా తాజాగా మరో రెండు నెలల నిధులు తిరిగొచ్చాయి. ఈ మొత్తాన్ని మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేసేందుకు డీఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియను వేడుకలా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కళాజాత బృందాలతో నియోజకవర్గ స్థాయిలో అవగాహన చేపట్టనున్నారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వడ్డీ రాయితీ, బ్యాంక్ లింకేజీ రుణాలు, ప్రమాద బీమా చెక్కులను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వడ్డీ రాయితీ చెల్లింపు ఇలా..
మహిళా సంఘాలకు ఆయా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తుంటాయి. రుణం పొందిన సభ్యులు నెలకు రూ.100కు 9.5శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది. సభ్యులు బ్యాంకులకు చెల్లించిన ఈ మొత్తాన్ని ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో జమ చేస్తుంది. తద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు అవుతుంది. ఎప్పటికప్పుడు కాకుండా ప్రభుత్వం రెండు మూడేళ్లకు ఒక్కసారి నిధులు విడుదల చేస్తోంది. ఈ సొమ్మును సంఘం సభ్యులకు పంచనున్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే సర్కారు లక్ష్యం.
10,805 సంఘాలకు లబ్ధి
జిల్లాలో మొత్తం 657 గ్రామైక్య సంఘాలు ఉండగా వీటి పరిధిలోని 16,054 స్వయం సహాయక సంఘాల్లో 1,63,703 మంది సభ్యులుగా ఉన్నారు. ఇందులో 10,805 సంఘాలు రుణాలు పొందేందుకు అర్హత సాధించాయి. నాలుగేళ్లుగా ఈ గ్రుపులకు రుణాలు ఇస్తున్నారు. వీటి ఖాతాల్లోనే ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ రాయితీ జమ చేయనున్నారు. ఇటీవల 2023 మార్చి నుంచి 2025 జనవరి వరకు రూ.28.38 కోట్లు విడుదల చేయగా తాజాగా మారోసారి నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన రూ.4.28 కోట్లు మంజూరయ్యాయి. దీంతో రూ.32.66 కోట్లు సంఘాల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ వారంలో ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన మరో రెండు సంవత్సరాల బకాయిలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఈ మొత్తం రూ.30 కోట్ల వరకు ఉండొచ్చని తెలిసింది. ఇవి గత ప్రభుత్వ హయాంలోవి కావడంతో ఇస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము చెల్లించిన వడ్డీ డబ్బులు తిరిగి రావడంపై మహిళా సమాఖ్య సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
జిల్లాలో స్వయం సహాయక సంఘాలు 10,805 విడుదలైన మొత్తం రూ.32.66 కోట్లు నేటి నుంచి మహిళా సంఘాలకు అందజేత కసరత్తు చేస్తున్న డీఆర్డీఏ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్న సభ్యులు
కొన్ని సంఘాలకే నిధులు
వడ్డీ డబ్బులు కొద్ది మొత్తంలో విడుదల చేశారు. దీంతో కొన్ని సంఘాలకే నిధులు అందాయి. మండలంలో చాలా సంఘాలకు వడ్డీ చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఆ దిశ చొరవ చూపి సకాలంలో డబ్బు అందేలా చూడాలి.
– పద్మమ్మ, సంఘం సభ్యురాలు, బొంపల్లి
సంతోషంగా ఉంది
ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ డబ్బులు చెల్లించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇటీవలే తమ సంఘానికి వడ్డీ డబ్బులు జమయ్యాయి. ఇంకా తొమ్మిదేళ్ల వడ్డీ డబ్బులు రావాల్సి ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– సత్యమ్మ, సంఘం సభ్యురాలు, బొంపల్లి

వడ్డీ తిరిగొచ్చింది!

వడ్డీ తిరిగొచ్చింది!