
కరెంటు సమస్య తీర్చండి
ధారూరు: పొలాల్లో వేసిన ట్రాన్స్‌ఫార్మర్లు తరుచూ కాలిపోవడం, కొత్తగా అమర్చిన మోటార్లు నడవకపోవడంపై ధారూరు రైతులు సోమవారం శాసనసభ స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పదేపదే చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ట్రాన్స్‌ఫార్మర్ల కెపాసిటీ పెంచి, కొత్త లైన్ వేయించాలని అభ్యర్థించారు. ఒకే లైన్‌లో 25 కేవీల రెండు మినీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. లోడ్ అధికం కావడంతో ఇవి తరచూ పాడవుతున్నాయని తెలిపారు. ఫలితంగా పంటలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని చెప్పారు. రెండు మినీ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 63 కేవీల ఒకే ట్రాన్స్‌ఫార్మర్ అమర్చాలని స్పీకర్‌కు విన్నవించారు. ప్రస్తుతం వరి సాగుకు నారు పోశామని, కరెంట్ మోటార్లు సరిగా నడవక నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. దీనిపై స్పందించిన స్పీకర్ ట్రాన్స్‌కో ఎస్‌ఈకి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎక్కువ కెపాసిటీ కలిగిన కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కలిసిన రైతులు