
గాడితప్పిన పల్లెపాలన
షాబాద్: ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయి. పంచాయతీల్లో డబ్బులు లేక, ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటు పడుతుంది. గతేడాది జనవరి 31తో గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో వీధి దీపాలు, బోర్ల మరమ్మతులు, పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ కొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులకు సైతం జీతాలు చెల్లించలేని స్థితిలో పంచాయతీలున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడి పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది. పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేయడంతో పాటు సరైన నిర్వహణ లేక పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాల పరిస్థితి అధ్వానంగా మారింది.
పంచాయతీ కార్యదర్శులపై పనిభారం
జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కల్వకుర్తి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లో మొత్తం 526 గ్రామ పంచాయతీలున్నాయి. 16 నెలల క్రితం గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగిస్తున్నది. దీంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ అంతంతా మాత్రంగానే ఉండడంతో పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది. వనమహోత్సవం, ఉపాధిహామీ, పల్లెప్రగతి, ఇంటి పన్నుల వసూలు, పారిశుద్ధ్యం తదితర పనులతో పంచాయతీ కార్యదర్శులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో చెత్త సేకరణ ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారింది. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ నిధులు రాకపోవడంతో పెద్ద సమస్యగా మారింది. ఒక్కో గ్రామ పంచాయతీలో వివిధ పనులు చేపట్టడానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నామని కార్యదర్శులు వాపోతున్నారు. వర్షాకాలం ప్రారంభంలోనే గ్రామాల్లో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య పనులు చేపట్టేవారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యంతో వ్యాధుల ముప్పు పొంచి ఉందని ప్రజలు వాపోతున్నారు.
జిల్లాలో నిధులు లేక అభివృద్ధికి నోచుకోని గ్రామాలు
ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువు
పనిభారంతో ఇబ్బందులు పడుతున్న పంచాయతీ కార్యదర్శులు
పల్లె ప్రకృతివనాల పరిస్థితి అధ్వానం
పారిశుద్ధ్య నిర్వహణ
గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ఉండేలా పంచాయతీ కార్యదర్శులతో ప్రతీవారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాం. వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాం. పెండింగ్ బిల్లులు ఉన్నప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణలో జాప్యం లేకుండా చూస్తున్నాం. – అపర్ణ, ఎంపీడీఓ, షాబాద్

గాడితప్పిన పల్లెపాలన