
బడి వద్దకే బియ్యం
బొంరాస్‌పేట: ప్రభుత్వం సర్కారు బడులకు ప్రతీ నెల అందించే మధ్యాహ్న భోజన పథకం సన్న బియ్యం ఈ నెల నుంచి నేరుగా పాఠశాలలకే చేరనున్నాయి. రెండేళ్లుగా మండల కేంద్రం నుంచి లేదా మార్గమధ్యలో నుంచి సొంత ఖర్చులు భరించాల్సిన బాధలు తొలిగాయని బొంరాస్‌పేట, దుద్యాల ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాఠశాలలకు రోడ్డు సౌకర్యం లేదని, వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నామని కుంటిసాకులు చెబుతూ బియ్యం సరఫరా కాంట్రాక్టరు రవాణా డబ్బులు జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. మండల కేంద్రంలో డంప్ చేస్తుండడంతో అవి సకాలంలో పాఠశాలలకు అందక ముక్కిపోయి, పురుగులు పడి పాడైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. మండల కేంద్రం మార్గమధ్య నుంచి హెచ్‌ఎంలు ప్రైవేట్ వాహనాల్లో తమ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం బియ్యం తెప్పించుకున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టిన సమయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి సన్నబియ్యం రవాణా ఇబ్బందలు తొలగిస్తామని చెప్పారు. సర్కార్ బడులకు ప్రతీనెల అందించే హమాలీ పేరుతో సీఆర్‌పీల నుంచి అక్రమ వసూళ్లు ఉండరాదని హెచ్చరించారు.
ఈ నెల నుంచి స్టాక్ పాయింట్ నుంచి నేరుగా పాఠశాలలకు చేరవేత
రెండేళ్లుగా సొంత ఖర్చులు భరించిన హెచ్‌ఎంలు
వెతలు తీరాయని హర్షం
ఉమ్మడి మండలంలో సన్న బియ్యం సరఫరా వివరాలు
పాఠశాలలు 77
విద్యార్థుల సంఖ్య 2,800
ప్రతీ నెల సరఫరా చేసే బియ్యం 76.50 క్వింటాళ్లు
1–5 తరగతుల విద్యార్థులకు 100 గ్రాములు
6–9 తరగతుల విద్యార్థులకు 150 గ్రాములు