
మూగజీవాల గొంతెండుతోంది!
● పలు గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన నీటి తొట్లు ● మరి కొన్నిచోట్ల నీటి వసతి లేకనిరుపయోగం ● ఆందోళన చెందుతున్న రైతులు ● పట్టించుకోని అధికారులు
దోమ: వేసవిలో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన నీటి తొట్లు నిరుపయోగంగా మారాయి. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో పశువుల దాహం తీర్చడం రైతులకు ఇబ్బందిగా మారింది. దోమ మండలంలో 11,850 ఎద్దులు, 9,964 ఆవులు, 26,312 గొర్రెలు, 17,163 మేకలు ఉన్నాయి. వీటి దాహార్తి తీర్చేందుకు గతంలో ఆయా గ్రామాల పరిధిలో 60 తొట్లను నిర్మించారు. ప్రస్తుతం కొన్ని చోట్ల నీటి వసతి లేక నిరుపయోగంగా మారగా.. మరి కొన్ని గ్రామాల్లో శిథిలావస్థకు చేరాయి. దీంతో నీరులేక జీవాలు అల్లాడిపోతున్నాయి. ప్రభుత్వం పశువుల సంరక్షణ కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన తొట్లకు పంచాయతీ బోర్ల నుంచి నీటిని సరఫరా చేయాలి. పశువైద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో రైతులు పశువుల దాహార్తి తీర్చేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. చెరువుల్లో సైతం నీరు అడుగంటడంతో సమస్య మరింత పెరిగింది. అధికా రులు స్పందించి దెబ్బతిన్న నీటితొట్లను బాగు చేయించడంతోపాటు శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్త తొట్లను నిర్మించాలని రైతులు కోరుతున్నారు.