డిపాజిట్లు గల్లంతు | - | Sakshi
Sakshi News home page

డిపాజిట్లు గల్లంతు

Dec 5 2023 5:28 AM | Updated on Dec 5 2023 5:28 AM

ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్న అధికారులు (ఫైల్‌)  - Sakshi

ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్న అధికారులు (ఫైల్‌)

వికారాబాద్‌: కేంద్రంలో అధికారంలోకి ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌ జిల్లాలో ఆ పార్టీ నేతలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఒక్క పరిగిలో మినహా మిగతా మూడు స్థానాల్లో ఆ పార్టీ నేతలు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. మొత్తంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పరిగిలో 15 మంది అభ్యర్థులు, వికారాబాద్‌లో 12, తాండూరులో 21, కొడంగల్‌లో 13 మంది మొత్తం 61 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇందులో నలుగురు కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ నాలుగు చోట్ల డిపాజిట్లు దక్కించుకుంది. ఇక బీజేపీ మూడు చోట్ల పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల్లో పోటీ చేయగా తాండూరులో ఆ పార్టీ మిత్ర పక్షం అయిన జనసేనకు టికెట్‌ కేటాయించింది. అయితే పరిగిలో ఒక్కచోట తప్ప బీజేపీ అభ్యర్థులు కనీసం డిపాజిట్‌ దక్కించుకోలేకపోయారు. ఇక తాండూరులో జనసేన అభ్యర్థి సైతం డిపాజిట్‌ కోల్పోయాడు. డిపాజిట్‌ దక్కించుకునేందుకు కావాల్సిన ఓట్లలో సగం ఓట్లు కూడా తెచ్చుకోలేక జనసేన అభ్యర్థి చతికిలపడిపోయాడు.

పరిగిలోనే బెటర్‌..

మొత్తం జిల్లాలో ఆయా పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం 61 మంది పోటీ చేయగా ఇందులో 52 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. దీంతో పోటీ కేవలం కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ అనేది స్పష్టంగా కనిపించింది. ఒక్క పరిగిలో మినహా జిల్లాలో ఏ నియోజకర్గంలో కూడా బీజేపీ కనీసం పోటీలో కూడా నిలవలేకపోయింది. పరిగి బీజేపీ అభ్యర్థి బూనేటి కిరణ్‌ 16,597 ఓట్లు సాధించటం ద్వారా డిపాజిట్‌ దక్కించుకున్నారు. అయితే ఇక్కడ బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు 10వేల వరకు ఉండగా అతని సొంత సామాజికవర్గం గౌడ కులుస్తుల ఓట్లు సాధించటంలో కొంతవరకు ఆయన సఫలమైనట్లు కనిపించింది. ఈ నేపథ్యంలోనే అతను గౌరప్రదమైన ఓట్లు సాధించారు. ఇక వికారాబాద్‌లో బీజేపీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ 7,128 ఓట్లు సాధించినప్పటికీ డిపాజిట్‌ మాత్రం దక్కించు కోలేకపోయాడు. కొడంగల్‌ బీజేపీ అభ్యర్థి బంటు రమేశ్‌కు కేవలం 3,988 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. బీజేపీతో పొత్తులో భాగంగా తాండూరులో పోటీచేసిన జనసేన అభ్యర్థి శంకర్‌గౌడ్‌కు 4,087 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఇక్కడ కూడా డిపాజిట్‌ కల్పోయారు. ఇక బీఎస్పీ సైతం జిల్లాలో నాలుగు చోట్ల పోటీచేయగా ఆ పార్టీ అభ్యర్థులు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్‌ దక్కించుకోలేదు. ఇక ఇండిపెండెంట్లు నామమాత్రపు ఓట్లకే పరిమితమయ్యారు.

పోస్టుమార్టం చేసుకుంటున్న నేతలు

కౌంటింగ్‌ ముగిసి ఫలితాలు తేలటంతో పాటు బూత్‌లు, గ్రామాలు, మండలాల వారీగా.. పార్టీలకు, అభ్యర్థులకు పోలైన ఓట్ల లెక్క తేలింది. దీంతో ఆయా పార్టీలు, అభ్యర్థులు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నేతలు తమకు, తమ ప్రత్యర్థులకు వచ్చిన ఓట్లను పోస్టుమార్టం చేయటంలో నిమగ్నమయ్యారు. ఎన్ని పోలింగ్‌ బూత్‌లు, ఎన్ని గ్రామాల్లో తాము ఆధిక్యం సాధించాం...? ఎన్నిచో ట్ల మైనస్‌లో ఉన్నాం.. ఏ నాయకుడు ఎంతవరకు ప్రభావం చూపాడు.. ఎంతవరకు ఓట్లు రాబట్టడంలో సఫలమయ్యారు..? ఫలానా గ్రామంలో, ఫలానా బూత్‌లో ఓట్ల మైనస్‌కు కారణ మేంటి...? అన్న తరహాలో వచ్చిన ఫలితాలను పోస్టుమార్టం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఎంత డబ్బులు ఖర్చుచేశాం..ఇచ్చిన డబ్బు ఓటరు వరకు చేరిందా లేదా..? అనే కోణంలోనూ విశ్లేశించుకుంటున్నారు.

జిల్లాలో ప్రభావం చూపని బీజేపీ, బీఎస్పీ

పరిగిలో పరువు నిలుపుకొన్న బీజేపీ

డిపాజిట్లు కోల్పోయిన 52మంది అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement