
పారిశుద్ధ్య పనులు చేస్తున్న పంచాయతీ కార్మికులు
ఇబ్రహీంపట్నం రూరల్: పంచాయతీ కార్మికులు, సిబ్బంది బతుకులు అగమ్యగోచరంగా మారాయి. తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చి చెత్తాచెదారాన్ని శుభ్రం చేస్తున్నా వేళకు జీతాలు అందడం లేదు. గత డిసెంబర్ నుంచి నేటి వరకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో బిల్ కలెక్టర్లు, కారోబార్లు, వాటర్ మెన్, కంప్యూటర్ ఆపరేటర్లు, కమోటీ, స్వీపర్లు పని చేస్తున్నారు. వీరంతా నాల్గవ తరగతి ఉద్యోగుల కంటే ధీనమైన పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారు. బిల్ కలెక్టర్లు, కారోబార్లు మినహాయిస్తే మెజార్టీ పారిశుద్ధ్య పనులు చేసే వారు దళిత కుటుంబాలకు చెందిన వారే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారిశుద్ధ్య కార్మికుడికి నెలకు రూ. 18 వేల జీతం ఇవ్వాలి. కానీ ఇదెక్కడా అమలు కావడం లేదు. ప్రతి పంచాయతీలో పని చేసే సిబ్బంది, కార్మికులకు రూ. 4వేల నుంచి మొదలుకొని రూ. 12వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇచ్చేది తక్కువ జీతమే అయినా నెలనెలా ఇవ్వడం లేదని, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. రెండు రోజుల క్రితం ఒక నెల జీతం మాత్రమే చెల్లించినట్లు తెలిసింది. మండలంలోని 14 పంచాయతీల్లో 350 మంది వివిధ పనులు చేస్తుంటారు. వీరంతా జీతాల కోసం పడిగాపులు కాస్తున్నారు. పంచాయతీలు ప్రతి బిల్లునూ ట్రెజరీ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి సరైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో నెలలుగా చెక్కులు విడుదల కావడం లేదు. ఒక్కో పంచాయతీలో కనీసం తక్కువలో తక్కువగా 10లక్షల రూపాయల విలువ చేసే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో పంచాయతీలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. జీతాల కోసం పంచాయతీ కార్మికులు అధికారుల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సైతం సమాధానం చెప్పలేక మొహం చాటేస్తున్నారు.
పంచాయతీ కార్మికులకు అందని వేతనాలు
మూడు నెలలుగా నిరీక్షణ
రేపు మాపు అంటున్న అధికారులు
అప్పుల ఊబిలో కుటుంబాలు
అప్పులు చేస్తున్నాం
ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీల్లో పనులు చేస్తున్నాం. కానీ జీతాలు మాత్రం సకాలంలో రావడం లేదు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక పోతున్నాం. కుటుంబ పోషణ భారంగా మారింది. రేషన్ బియ్యంతో కాలం నెట్టుకొస్తున్నాం. ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు వస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఆ దిశగా చొరవ తీసుకోవాలి.
– సుక్కమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు, కప్పపహాడ్
జీతాలు చెల్లించాలి
పంచాయతీ కార్మికులు, సి బ్బంది పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి. ప్ర భుత్వం పారిశుద్ధ్య కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. కడుపు చేత పట్టుకొని గ్రామాలను శుభ్రం చేస్తారు. వారిని ఉపవాసం ఉంచితే ఎవరికీ మంచిది కాదు. సీఐటీ యూ ఆధ్వర్యంలో జీతాలు ఇచ్చే వర కు పోరాటం చేస్తాం. కలెక్టర్ కార్యాలయాలు ముట్ట డిస్తాం.
– జగదీష్ , సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు

