మార్కులు సృజనాత్మకతకు
సూచిక మాత్రమే
నేడు ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు
31 వేల మంది విద్యార్థుల
ఎదురుచూపులు
కుంగిపోవద్దు..
తిరుపతి అర్బన్: పదో తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. గురువారం ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఫలితాల కోసం 31,435 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు మందలిస్తారని, బంధుమిత్రులు హేలళ చేస్తారని మానసిక క్షోభను అనుభవిస్తూ కుంగిపోతుంటారు. వాటి ఫలితంగా క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. విద్యార్థులు అలా కుంగిపోకుండా చాలెంజ్‌గా తీసుకుని ముందడుగు వేయాలని పలువురు నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు కూడా వారిని మందలించకుండా ధైర్యం చెప్పాలని సూచిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష తప్పినంత మాత్రాన భవిష్యత్ లేదని తల్లిదండ్రులు, బంధువులు ముద్రవేసి మానసికంగా కుంగిపోయేలా చేయవద్దని విద్యావేత్తలు చెబుతున్నారు. పరీక్షల్లో సాధించిన మార్కులు బతకడానికి కొలమానం కాదని, విద్యార్థుల సృజనాత్మకతకు సూచికగానే భావించాలని పేర్కొంటున్నారు. పరీక్షల్లో తప్పిన వారిని తల్లిదండ్రులు మందలించకుండా ధైర్యం చెప్పి ప్రోత్సహించాలని, అప్పుడే వారు మరింత ధృడంగా తయారై ఏ పరీక్షలనైనా ఎదుర్కొంటారని చెబుతున్నారు. ప్రతి ఏటా ఫలితాలు విడుదలైన కొద్ది రోజుల్లోనే సప్లిమెంటరీ, ఇన్‌స్టెంట్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు మళ్లీ నిర్వహిస్తారని, వాటిలో విజయం సాధించేందుకు పట్టుదలతో కృషి చేస్తే సరిపోతుందని వెల్లడిస్తున్నారు.
పరీక్ష ఫలితం కొలమానం కాదు
పరీక్షల్లో తప్పిన ఎందరో ప్రయోజకులయ్యారు
విద్యార్థి దశలో పలు పరీక్షల్లో తప్పిన ఎంతో మంది విద్యార్థులు ఆ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతోపాటు ఇంజినీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులుగా రాణించారు. దేశ రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో నిలిచారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని అది మళ్లీ చేయకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. పరీక్ష తప్పితే జీవితం కోల్పోయినట్లు భావించడం సరికాదు. విద్యార్థికి ఉండాల్సిన ప్రధాన లక్షణం చిన్నతనం నుంచే ఆటుపోట్లను ఎదుర్కోంటూ ముందుకు సాగడమే. గురువారం టెన్త్ పరీక్షల ఫలితాలు రానున్నాయి. మార్కులు తక్కువ వచ్చినా.. ఎక్కువ వచ్చినా పాజిటివ్‌గా తీసుకోవాలి. తర్వాత లోటుపాట్లు సవరించుకుంటూ భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలి. – కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి


