లైసెన్స్‌.. లెసన్స్‌ | - | Sakshi
Sakshi News home page

లైసెన్స్‌.. లెసన్స్‌

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

● డ్రైవింగ్‌ టెస్ట్‌పై ఆర్టీఏలో తర్జనభర్జనలు ● రోడ్డు భద్రతపై అవగాహన ఉంటేనే లైసెన్స్‌ ● టెస్టుకు ముందే లెసన్స్‌ ఉత్తమం

డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీ ప్రక్రియలో ఆర్టీఏ మరో పరీక్షను చేర్చేందుకు సమాయత్తమవుతోంది. ముందస్తుగా ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు భద్రతపై పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదనపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం జారధి పోర్టల్‌లో స్లాట్‌ నమోదు చేసుకున్న వారికి ఆర్టీఏ కేంద్రాల్లో లెర్నింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉతీర్ణులైన వారికి ఎల్‌ఎల్‌ఆర్‌ ఇస్తారు. దీనికి ఆరు నెలలు గడువు ఉంటుంది. ఆలోపు డ్రైవింగ్‌ నేర్చుకుని ట్రాక్‌లలో వాహనం నడిపిన వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం స్లాట్‌ నమోదుకు ముందే ఆన్‌లైన్‌ టెస్ట్‌లో పాల్గొనాలనే కొత్త నిబంధనను ఆర్టీఏ తీసుకువస్తోంది. ఆ తర్వాతే ఎల్‌ఎల్‌ఆర్‌కు అనుమతి లభిస్తుంది.

తిరుపతి మంగళం : డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరులో కొత్త నిబంధనలు తీసుకురావడానికి ఆర్టీఏ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు వాహనం లెర్నింగ్‌ లైసెన్స్‌ కోసం రెండు పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ టెస్టులు 3 గంటల సమయంతో ఆరు మాడ్యూల్స్‌తో ఉంటాయి. మొదట రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌ నిబంధనలపై వీడియోలను వీక్షించాలి. అనంతరం టెస్టులో సరైన సమాధానాలు ఇవ్వాలి. తర్వాత దరఖాస్తుదారుల మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేస్తేనే స్లాట్‌ లభిస్తుంది. ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలోని ఐదు ఆర్టీఏ కేంద్రాల పరిధిలో రోజుకు 1000 నుంచి 1500 లెర్నింగ్‌ లైసెన్స్‌లు అందజేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, ప్రైవేటు ఉద్యోగులు, వివిధ రంగాల్లో పనిచేసే వారు 3 గంటల పాటు ఈ ముందస్తు టెస్టులకు హాజరుకావడం సాధ్యమవుతుందా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ విధానాన్ని అమలుచేస్తే లెర్నింగ్‌ లైసెన్స్‌ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ఆన్‌లైన్‌ టెస్టులకు నిజాయితీగా ఎంతమంది హాజరవుతారనేది కూడా సందేహమే. ఇందులో ఏజెంట్లు, డ్రైవింగ్‌ స్కూళ్ల ప్రమేయం పెరిగే అవకాశం ఉంది.

ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి

ప్రతి వాహనదారుడు ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షకు హాజరయ్యే ముందే ట్రాఫిక్‌, రవాణా శాఖల నింబంధనలు, రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సామర్థ్యానికి మించి వాహనాలు కొనుగోలు చేయడం సరికాదు. నియమాలతోపాటు రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన ఉంటేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. వాహనదారులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యమే వారి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. – కొర్రపాటి మురళీమోహన్‌,

తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు...

ప్రమాదాల నియంత్రణకు రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా అవగాహన ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో రహదారి భద్రత కమిటీ ఆదేశాలతో రవాణాశాఖ ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఆన్‌లైన్‌ టెస్టులకంటే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షలకు హాజరైన సమయంలోనే రోడ్డు నిబంధనలపై అరగంట పాటు వీడియోలను ప్రదర్శించి, మరో అరగంట సూచనలు, సలహాలతో అవగాహన కల్పిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని రహదారి భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల తక్కువ వ్యవధిలో ఎక్కువ మందికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement