అక్రమంగా జామాయిల్‌ చెట్ల నరికివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా జామాయిల్‌ చెట్ల నరికివేత

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

● కర్ర తరలింపును అడ్డుకున్న ఫారెస్ట్‌ అధికారి ● పచ్చనేతల పేర్లు చెప్పి.. అధికారికి బెదిరింపులు

నాయుడుపేట టౌన్‌: మండలంలోని శ్రీనివాసపురం జగనన్న లేఅవుట్‌ సమీపంలో సోషల్‌ ఫారెస్ట్‌కు సంబంధించి భూమిలో ఉన్న వన సంరక్షణ సమితికి చెందిన జామాయిల్‌ చెట్లను బుధవారం సాయంత్రం గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులు నరికి వేశారు. ఉదయం నుంచి చెట్ల నరికివేతను స్థానిక వీఆర్వో అడ్డుకున్నారు. సాయంత్రం ఎవరూ లేని సమయంలో తమిళనాడుకు చెందిన కూలీలను తీసుకువచ్చి ఓం మురుగన్‌ ఉడ్‌ సప్లయిర్స్‌ వారు యంత్రాలతో చెట్లను నరికి వేసి ఏకంగా కర్రను లోడింగ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది గ్రామస్తులు లారీ వద్దకు వెళ్లి అడ్డుకున్నా వారిని అక్రమార్కులు బెదిరించారు. సమాచారం తెలుసుకుని నెల్లూరులో ఉన్న సోషల్‌ ఫారెస్ట్‌కు సంబంధించి డిప్యూటీ రేంజ్‌ అధికారి భాగ్యమ్మ హుటాహుటిన శ్రీనివాసపురం అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే లారీలో కర్రలను లోడింగ్‌ చేస్తుండటాన్ని ఆమె గుర్తించి అడ్డుకున్నారు. అక్కడ కర్ర లోడింగ్‌ చేయిస్తున్న వ్యక్తి ఇది అధికారపార్టీ నాయకులదని, దీనిని అడ్డుకుంటే బాగుండదని ఆమైపె బెదిరించాడు. మీపై కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తామని ఏకంగా ఆమెను బెదిరించడం విశేషం. ఈ విషయమై డిప్యూటీ రేంజ్‌ అధికారి విలేకరులతో మాట్లాడుతూ తమ శాఖ పరిధిలో ఉన్న జామాయిల్‌ చెట్లను అక్రమంగా నరికి వేస్తుండడాన్ని అడ్డుకున్నామన్నారు. దీంతో లారీలో లోడింగ్‌ చేసిన కర్రలను దించివేసి లారీ వెళ్లిపోయిందన్నారు. అంతేకాకుండా తనకు అధికారపార్టీ నాయకుల పేర్లు చెప్పి బెదిరించారని ఆమె వాపోయారు. చెట్లను అక్రమంగా నరికి వేయడమే కాకుండా అధికారపార్టీ నాయకుల పేర్లు ఎలా చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా నరికిన జామాయిల్‌ చెట్లను తమ శాఖ పరిధిలో ఉన్న కార్యాలయంలో భద్రత పరిచి వాటికి వేలంపాటలు నిర్వహించి విక్రయాలు జరుపుతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement