సాక్షి, టాస్క్‌ఫోర్స్: తిరుపతి నగర శివార్లలో భూ ఆక్రమణ దారులు ఇప్పటి వరకు చెరువులు, కుంటలు, కాలువలను దర్జాగా కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టారు. ఇప్పుడు చెరువు కట్టను సైతం తవ్వేసి అక్రమంగా నిర్మాణాలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. తుమ్మలగుంట నుంచి జాతీయ రహదారికి వెళ్లే దారిలో ఓంశక్తి ఆలయం వద్ద చెరువు కట్ట తవ్వేసి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. చెరువులోకి నీరు వచ్చినపుడు కట్ట తవ్వేయడంతో వరదనీరు గ్రామంలోకి చొరబడే అవకాశం ఉంటుందని కట్టకు ఆనుకుని నివాసముంటున్న వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్టను తవ్వేసి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నట్టు నీటి పారుదలశాఖ, రెవెన్యూ శాఖల అధికారులకు సమాచారం అందించినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై దృష్టి సారించి అక్రమ కట్టడాలను తొలగించి కట్టను యథావిధిగా పటిష్టం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


