రామచంద్రాపురం: మండల పరిధిలోని సి రామాపురం సమీపంలో ఉన్న శ్రీబ్రహ్మర్షి గురూజీ ఆశ్రమాన్ని మంగళవారం తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల దంపతులు సందర్శించారు. ముందుగా వారికి ఆశ్రమ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమ ప్రాంగణంలోని లక్ష్మీనారాయణ మందిరం, జైన్ మందిరాలను దర్శించినంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గవర్నర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.
బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల (విభిన్న ప్రతిభావంతుల) బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 23 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. దృష్టి లోపం గల వారికి (14 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ 2, ఏఎన్‌ఎం గ్రేడ్ 3 మహిళలు 11), బధిర (మూగ, చెవుడు) లోపం గల వారికి 9 పోస్టులు, ఏఎన్‌ఎం గ్రేడ్ 3 (మహిళ) 9, శారీరక (చలన) లోపం గల దివ్యాంగులకు 1 పోస్టు (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1, జనరల్) పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలన్నారు. 01–07–2026 నాటికి 52 ఏళ్లు (42+10) మించకూడదని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 15వ తేదీ లోపు చిత్తూరు కలెక్టరేట్‌లోని విభిన్నప్రతిభావంతుల శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాలకు www.chioorr.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
కచ్చిత సమాచారంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే
తిరుపతి అర్బన్: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ప్రతి కుటుంబం నుంచి కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తూ, వేగవంతంగా సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, డీఆర్వో నరసింహులుతో కలసి అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పొరబాట్లకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయ సమాచారం, సామాజిక–ఆర్థిక స్థితిగతులు పూర్తిగా పరిశీలించి నమోదు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ భరత్‌నాయక్, డీపీవో సుశీలాదేవి, డీడీఓ నారాయణరెడ్డి, డీఆర్‌డీఏ పీజీ శోభనబాబు, డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్ పాల్గొన్నారు.
ఏపీఆర్‌జేసీ దరఖాస్తుల గడువు పొడిగింపు
తిరుపతి సిటీ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గుడువు మరో మారు పొడిగించారు. మంగళవారంతో ముగిసిన దరఖాస్తుల గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
నేటి నుంచి
ఇంటర్ తరగతులు
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆర్‌ఐఓ జి రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీబీఎస్‌ఈ విధానం అమలులో భాగంగా ఈనెల 23వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 24 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. జూన్ ఒకటో తేదీన తిరిగి కళాశాలలు పున:ప్రారంభమవుతాయని తెలియజేశారు.


