చంద్రగిరి: కొన్ని రోజులుగా చంద్రగిరి మండలంలోని అటవీ సమీప గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగు తన గమనాన్ని మార్చుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు కూచివారిపల్లి సమీపంలో తిష్ట వేసి నానా బీభత్సవం సృష్టించింది. తాజాగా మంగళవారం సాయంత్రం ఒంటరి ఏనుగు చంద్రగిరి నుంచి భాకరాపేట వైపు తన గమనాన్ని మార్చుకుంది. ఈ క్రమంలో నాగపట్ల అటవీ ప్రాంతం నుంచి భాకారాపేట కనుమలలో రోడ్డు దాటుతుండగా ప్రయాణికులు గమనించారు. దీంతో వాహనాదారుల అప్రమత్తమయ్యే తమ వాహనాలను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఏనుగు గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఒంటరి ఏనుగు హల్‌చల్
చంద్రగిరి మండలంలోని ఎగువ కూచివారిపల్లిలో సోమవారం అర్ధరాత్రి ఒంటరి ఏనుగు స్థ్వైర్య విహారం చేసింది. అరటి, వరి పంటలతోపాటు ఫెన్సింగ్ రాళ్లు, మోటార్లను ధ్వంసం చేసింది. నెల రోజులుగా ఏనుగు పొలాలపై దాడులు చేస్తుండటంతో సర్వం కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి, గజ దాడులను అడ్డుకోవాలని కోరుతున్నారు.


