రేణిగుంట: మండలంలోని విమానాశ్రయ మార్గంలో ఉన్న ఔషధ తయారీ సంస్థ విన్‌టెక్ వద్ద సోమవారం కార్మికులు ధర్నాకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కంపెనీ గేటు ముందు బైఠాయించారు. కార్మికులు మాట్లాడుతూ, ప్రధానంగా ఆహారం, రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని, కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నామన్నారు. సుమారు 250 మంది ఆపరేటర్లు, 1000 మందికి పైగా ఉద్యోగులు ఇక్కడ సేవలందిస్తున్నారని తెలిపారు. 2025 జూన్‌లో విన్‌టెక్ కంపెనీని లెక్చర్ అనే మరో సంస్థ స్వాధీనం చేసుకుందని, ఆ సమయంలో తమ ఉద్యోగాలకు ఎటువంటి ముప్పు ఉండదని ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. మాట తప్పిన యాజమాన్యం, ఒప్పందానికి విరుద్ధంగా గతేడాది జూలై నుంచి తమను విధులకు దూరం చేశారని, కంపెనీ ఇబ్బందుల్లో ఉందంటూ బయటకు పంపించేశారని వాపోయారు. కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని, గత 20 రోజులుగా అధికారులు కూడా సరైన స్పందన ఇవ్వడం లేదన్నారు. మార్చి 14న ఇచ్చిన నోటీసు ప్రకారం ఏప్రిల్ 1 నుంచి తమకు కనీసం భోజనం, రవాణా సదుపాయాలు కూడా నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం తెలిపిందని వివరించారు. ఇప్పటికే 250 మందిలో చాలా మంది వేరే పనులు వెతుక్కుని వెళ్లిపోయారని, ప్రస్తుతం ఉన్న 109 మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ధర్నా చేపట్టినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి
వింగ్‌టెక్, లక్స్‌షేర్ కంపెనీల మధ్య జరిగిన వ్యాపార వైఫల్యం కారణంగా ఉద్యోగులమైన మమ్మల్ని బలి చేయడం అన్యాయం. మా దుస్థితిని సీఎం దష్టికి తీసుకొని వెళ్లేందుకే నిరసన తెలుపుతున్నాం. సీఎంను నేరుగా కలవలేకపోయినా మా బాధ, మాకు జరిగిన అన్యాయం గురించి సీఎంకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తాం. మాకు న్యాయం జరిగే వరకూ ఈ నిరసనను కొనసాగిస్తాం.
– చంద్రకళ, కంపెనీ ఉద్యోగి, రేణిగుంట
లేబర్ అధికారుల నిర్లక్ష్యం వల్లే..
ప్రైవేట్ కంపెనీ యాజమాన్యంతో లేబర్ అధికారులు లోపాయికార ఒప్పందం కుదుర్చుకుని కార్మికుల పట్ల వ్యవహరించిన నిర్లక్ష్యం వల్లే కార్మికులు ప్రస్తుతం వీధిపాలయ్యారు. కార్మికులను యథావిధిగా కొనసాగించకపోతే కార్మికులకు అండగా సీఐటీయూ ఉండి జిల్లా వ్యాప్తంగా నిరసన తెలుపుతాం.
– సెల్వరాజ్, సీఐటీయూ నేత, రేణిగుంట


