● బాటిల్‌తో దాడి చేసి పరారైన క్లీనర్.. పోలీసుల గాలింపు
తిరుపతి క్రైం : నగరంలోని చింతలచేను రోడ్డులో ఉన్న మంజునాథ ట్రావెల్స్ రెస్ట్‌రూమ్‌లో ఓ డ్రైవర్ అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మృతుడు స్టాన్లీ సెల్వరాజ్ ఎం (70), తండ్రి మలోనీ, తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా రామగౌండనూర్ మల్లమూప్పన్‌పట్టి గ్రామానికి చెందినవాడు. అతడు మంజునాథ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చింతలచేను రోడ్డులోని మంజునాథ ట్రావెల్స్ రెస్ట్‌రూమ్‌లో స్టాన్లీ సెల్వరాజ్ తలకు తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉండగా గుర్తించారు. ఘటన సమయంలో అదే గదిలో రాజా అనే వ్యక్తి కూడా ఉన్నట్లు సహోద్యోగులు పోలీసులకు తెలిపారు. తాడిపత్రికి చెందిన రాజా అదే ట్రావెల్స్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో రాజా మృతుడిపై బాటిల్‌తో దాడి చేసి, అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి అనంతరం స్టాన్లీ సెల్వరాజ్ గది ముందు కుప్పకూలిపోయినట్లు తెలిసింది. కొంతసేపటి తర్వాత సహోద్యోగులు తిరుమల, చిన్న గోపీ గమనించి, వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అతడు మార్గంమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని తిరిగి రెస్ట్‌రూమ్ వద్దకు తీసుకువచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం నిందితుడు రాజా పరారై, తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


