పాకాల: అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న వారిని సీఐ చినగోవిందు సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. ఆదివారం వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ తన సిబ్బందితో పాకాల మండల పరిధిలోని కుందేటివారిపల్లి, శంకంపల్లి రోడ్డు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు అనుమానాస్పద ప్రవర్తన కలిగిన నలుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి 5.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఒక నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో తిరుపతి మంచాల వీధికి చెందిన పూజారి ముని, లింగేశ్వర్ నగర్‌కు చెందిన ముల్లతంటి రాకేష్, తాతయ్యగుంటకు చెందిన సింగనమల్లి సునీల్‌కుమార్, అక్కనగారి వెంకటసాయి ఉన్నారని తెలిపారు. వీరు తిరుపతికి చెందిన జనార్దన్ వద్ద కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసిందని అతడిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నిందితులపై సీఐ చినగోవిందు కేసు నమోదు చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ తరుణ్, సిబ్బంది పాల్గొన్నారు.


