నాపేరు సుబ్బమ్మ, మాది కేవీబీపురం మండలంలోని ఎస్‌ఎల్ పురం ఎస్టీకాలనీ. మా కుమారుడు పేరు ఇ.బాలాజీ, అయితే 2024 మార్చిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన గాయాల నేపథ్యంలో మా కుమారుడు బాలాజీకి ఓ కాలు తీసివేశారు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పింఛన్ కోసం తిరుగుతున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని చెబుతున్నారు.అనుమతి వస్తే పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంటాం.
– కుమారుడు ఇ.బాలాజీతో తల్లి సుబ్బమ్మ
మా బిడ్డకు పింఛన్ ఇప్పించండి
నా పేరు మానస. మా భర్త గోపాలకృష్ణ, మాది శ్రీకాళహస్తి మండలంలోని జగ్గరాజు పల్లి గ్రామం. పేదరికంలో జీవనం సాగిస్తున్నాం. పోలియోతో మా బిడ్డ సామిత్(8) మంచానికే పరిమితం అయ్యాడు. పింఛన్ ఇప్పిస్తే ఆ డబ్బులతో మా బిడ్డకు వైద్యం చేయిస్తాం. వైద్య ఖర్చులు పెట్టుకోలేక అప్పులు చేయాల్సి వస్తుంది. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి.
– బిడ్డను చేతిలో పెట్టుకుని వెళుతున్న తల్లి మానస
ఎప్పుడిస్తారా అని ఎదురుచూస్తున్నాం
నా రెండు కాళ్లు పూర్తిగా సచ్చుబడిపోయాయి. మాది నారాయణవనం మండలంలోని ఎరిగంపట్టు గ్రామం, పేద కుటుంబానికి చెందిన తమకు పింఛన్ ఇప్పిస్తే ఆ నగదుతో జీవనం సాగిస్తాం. 20 నెలలుగా తిరుగుతున్నాం. అయితే అనుమతి రాలేదంటూ అధికారులు వాయిదా వేస్తున్నారు. ఎప్పుడు అనుమతి ఇస్తారోనని ఎదురుచూస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తమకు పించన్ వస్తే అదే వరంగా భావిస్తాం.
– నారాయణ, నారాయణవనం మండలం
అనుమతి రాలేదంటున్నారు..
నా పేరు లీలావతి. ఆరోగ్యం సరిగాలేక మంచానికే పరిమితం అయ్యాను. నాగాలాపురం మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాం. బతకడం కష్టంగా మారుతోంది. పింఛన్ ఇప్పిస్తే ఆ డబ్బులతోనే నా జీవనం సాగిస్తాం. పింఛన్లు ఇవ్వడానికి అనుమతి రాలేదంటూ అధికారులు చెబుతున్నారు. ఎప్పుడు అనుమతి వస్తుందో తెలియడం లేదు. ఈ క్రమంలో కుటుంబం గడవడం కష్టంగా మారింది.
– లీలావతి, వ్యాధిగ్రస్తురాలు, నాగలాపురం
●


