ఆదరణ కోల్పోతున్న పీజీ కోర్సులు గత ఏడాది కంటే భారీ స్థాయిలో తగ్గిన పీజీసెట్–2026 దరఖాస్తులు నేటితో ముగియనున్న పీజీసెట్ దరఖాస్తుల గడువు పలుసార్లు గడువు పొడిగించినా ఆసక్తి చూపని అభ్యర్థులు
హమ్మయ్యా..పరీక్షలు పూర్తయ్యాయి.. కొన్ని రోజులు విరామం.. ఆ తరువాత పోటీలో మళీపరుగు తప్పదు..డిగ్రీ పరీక్షలు రాసేశాం..ఇక ఇప్పుడేం చేయాలి.. ఉన్నత విద్యా.. ఇక చదివే ఓపిక లేదు.. ఏదో ఉద్యోగం చూసుకుంటే సరిపోద్దీ.. మళ్లీ పీజీ అంటే పీజీ సెట్ రాయాలి.. మరో రెండేళ్లు చదవాలి.. అంత కష్టం ఎక్కడబ్బా.. వద్దులే అన్నట్లుగా యువత ఉపాధి వైపు చూస్తుండడంతో పోసు్ట్రగాడ్యుయేన్ చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో పీజీ సీట్లు భర్తీ కాక మిగిలిపోతున్నాయి.
తిరుపతి సిటీ: పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటేనే పెద్ద చదువుగా భావించేవారు. పీజీ చేసిన వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గౌరవం ఉండేది. విద్యలోనే ఉన్నత చదువుగా గుర్తింపు పొందిన పీజీకి ప్రస్తుతం ఆదరణ తగ్గడంతో యూనివర్సిటీల భవితవ్యం ఆగమ్య గోచరంగా మారింది. క్రమక్రమంగా సాధారణ పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ లాంటి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గత మూడేళ్లుగా భారీ స్థాయిలో తగ్గుముఖం పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్, ఎంబీబీఎస్‌తోపాటు త్వరగా ఉపాధిని అందించే ఏఐ, మిషన్ లర్నింగ్, కోడింగ్, క్యాంటమ్ టెక్నాలజీ అంటూ పలు ప్రొఫెషనల్ కోర్సులపై మొగ్గు చూపడంతో సాధారణ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయని అధ్యాపకులు, వర్సిటీ అధికారులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు యూనివర్సిటీల్లో ఉన్నత విద్యగా గుర్తింపు పొందిన పీజీ కోర్సులకు ఆదరణ తగ్గడానికి నూతన విద్యావిధానం, కామన్ పీజీసెట్ సైతం ప్రధాన కారణమని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
భారీ స్థాయిలో తగ్గిన దరఖాస్తులు
ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీ సెట్–2026కు దరఖాస్తులు గత ఏడాది కంటే సుమారు 7 వేలకు పైగా తగ్గినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని సుమారు 17 యూనివర్సిటీల్లో 30 పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన పీజీ సెట్‌కు ఇప్పటి వరకు 17,621 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. 30 పాఠ్యాంశాలకు సంబంధించిన కోర్సుల్లో సుమారు 24 వేలకు పైగా సీట్లు ఉన్న నేపథ్యంలో 1:1 ప్రాతిపదికన సైతం దరఖాస్తులు అందకపోవడంతో పీజీ కోర్సుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది పీజీ సెట్ పరీక్ష అర్హత సాధించిన ప్రతి విద్యార్థికీ కచ్చితంగా సంబంధింత కోర్సులో సీటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది.
పలుసార్లు గడువు పొడిగించినా...
పీజీసెట్‌కు దరఖాస్తులను పెంచాలని ఉన్నత విద్యామండలి విశ్వ ప్రయత్నం చేస్తున్నా దరఖాస్తులు అంతంత మాత్రంగానే ఉండడం విశేషం. ఇప్పటికే పలుసార్లు దరఖాస్తుల గడువును పెంచుతూ ప్రసార మాద్యమాల ద్వారా ప్రచారం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు అందలేదు. శనివారంతో పీజీసెట్–2026 దరఖాస్తుల గడువు ముగియనుండడంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎస్వీయూ పరిపాలనా భవనం


