తిరుపతి అర్బన్: మత్స్యశాఖ దుస్థితికి చేరుకుంటోంది. తిరుపతిలోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయం వారు రూ.65 వేలు కరెంట్ చార్జీ బకాయిలు ఉండడంతో రెండు రోజుల క్రితం విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. దీంతో ఉద్యోగులు చేసేదేమీ లేక..సమీపంలోని మత్స్య దర్శినికి చెందిన భవనంలోకి తమ ఫైళ్లను, ఫర్నిచర్‌ను మార్చుకుని, విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయ నిర్వహణకు పైసా నిధులు విడుదల చేయకపోవడంతో పలు కార్యాలయాల పరిస్థితి దయనీయంగా మారింది. మత్స్యశాఖ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో చేపలు పెంచడానికి, మట్టి గుంతల్లోకి నీరు నింపడానికి విద్యుత్ మోటార్ ఉండేది. అయితే ఏడాది కిందట మోటారు చోరీకి గురైంది. కొత్త మోటారు కొనుగోలు చేయడానికి రూ.30 వేలు ఖర్చు అవుతుందని, నిధులు లేకపోవడంతో మోటారు కొనుగోలు చేయడం మానుకున్నారు. మోటారు లేకపోవడంతో చేపపిల్లలు పెంచే కార్యక్రమానికి స్వస్తి చెప్పేశారు. తాజాగా విద్యుత్ బిల్లు కట్టలేదని...కనెక్షన్ కట్ చేయడం పెద్ద చర్చినీయాశంగా మారింది.
మూడేళ్ల కిందట మత్స్యదర్శి భవనం పూర్తి
జిల్లా మత్స్యశాఖ కార్యాలయం వద్దే గత వైఎస్సార్‌సీపీ పాలనలో రూ.3 కోట్లు ఖర్చు చేసి మత్స్యదర్శిని పేరుతో ఓ భవనాన్ని నిర్మించారు. తిరుపతి నగరానికి వచ్చే యాత్రికులు మత్స్యదర్శిని చూడడానికి వచ్చే సందర్భంలో జిల్లాలో ఉంటున్న అన్ని రకాల చేపలను ప్రదర్శనగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతంలో విద్యుత్ కనెక్షన్‌తోపాటు పలు పరికరాలను సమకూర్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ భవనం జోలికి వెళ్లలేదు. కనీసం ఆ భవనాన్ని ప్రారంభోత్సవం చేయకుండా వదిలిపెట్టేశారు. అయితే మత్స్యశాఖ జిల్లా కార్యాలయానికి విద్యుత్ సరఫరా కట్ చేయడంతో ఆ భవనాన్ని ఇలా వాడుకోవాల్సి రావడం విడ్డూరంగా ఉంది.


