దొరవారిసత్రం: నెమిలమిట్ట అగ్రహారం పరిధిలోని ప్రాథమిక పాఠశాల భవన దుస్థితిపై ఇంటిలిజెన్స్ పోలీస్ అధికారులు శుక్రవారం ఆరా తీశారు. ‘శ్లాబ్ పెచ్చులూడి పడి విద్యార్థికి గాయాలు’ అనే వార్త సాక్షి దినపత్రికలో ప్రచురితమైన విషయం విధితమే. దీంతో ఇంటిలిజెన్స్ పోలీస్ అధికారులతో పాటు స్థానిక విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల భవనం పరిస్థితి ఎలా ఉందని స్థానిక ఉపాధ్యాయుడు శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. భవనం పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నూతన భవన నిర్మాణం కోసం సంబంధిత అధికారులు చర్యలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
పాకాల: స్థానిక రైల్వే స్టేషన్‌కి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రయాణిస్తున్న రైలు నుంచి జారి పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే పోలీసులు కథనం మేరకు.. తిరుపతి వైపు వెళుతున్న రైలు నుంచి జారి పడి సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతి చెందాడని, తెల్ల రంగుపై నల్ల రంగు గీతలు కలిగిన చొక్కా ధరించి ఉన్నాడని, అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిత్తూరు ఆర్పీ ఎస్‌ఐ ధర్మేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్టీల్ పరిశ్రమలో ప్రమాదం.. కార్మికుడి మృతి
పెళ్లకూరు: మండలంలోని పెన్నేపల్లిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో గురువారం జరిగిన ప్రమాదంలో వలస కార్మికుడు(42) మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. పరిశ్రమలోని యంత్రాల వద్ద పని చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడంతో వలస కార్మికుడుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. ఈ విషయమై పోలీసులు సమాచారం లేదు.
పేకాటరాయుళ్ల అరెస్టు
రూ.1.47 వేలు స్వాధీనం
చంద్రగిరి: మండలంలోని పాతశానంబట్ల గ్రామానికి దక్షణం వైపు అడవిలో శుక్రవారం సాయంత్రం పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరు వ్యక్తులు పారిపోయారు. రహస్యంగా అందిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం ఎస్‌ఐ రవిప్రకాష్ రెడ్డి తమ సిబ్బందితో సంఘటనాస్థలికి చేరుకుని జూదరులపై దాడి చేశారు. ఈ క్రమంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.1.47,600 నగదు, పేకముక్కలు, నాలుగు ద్విచక్రవాహనాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


