అధికార పార్టీ నేతల అండ లక్షల విలువైన కుంటభూమిపై టీడీపీ నేత కన్ను ఆక్రమణలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహశీల్దార్
చంద్రగిరి: లక్షలాది రూపాయల విలువైన కుంట పోరంబోకు స్థలాలపై టీడీపీ గద్దలు వాలాయి. గత కొన్ని నెలలుగా కుంటపోరంబోకును ఆక్రమించుకోవడానికి అన్ని విధాలుగా వ్యూహాలు రచించారు. ఈ క్రమంలో కుంటపోరంబోకు ఆక్రమణలపై 10 రోజులకు ముందే సాక్షి దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో బుధవారం టీడీపీకి చెందిన ఓ నేత కుంట భూమిని ఆక్రమించుకోవడంతోపాటు పిల్లర్లు వేయడానికి గుంతలను తీశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఆక్రమణలను అడ్డుకున్నారు. వివరాల్లోకెళితే.. మండల పరిధిలోని చంద్రగిరి శివారుల్లోని తొండవాడ పంచాయతీకి చెందిన అరుణ కాలనీ సమీపంలో సర్వే నంబరు 306/1లో 48 సెంట్ల గుర్రాలకుంట ఉంది. చంద్రగిరితోపాటు పరిసర ప్రాంతాల్లో పడిన వర్షపు నీరు గుర్రాలకుంట ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్తుంది. అయితే అదే ప్రాంతానికి చెందని ఓ టీడీపీ నాయకుడు గుర్రాలకుంటను ఆక్రమించుకోవడానికి గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన ఓ నేత అభయం ఇవ్వడంతో కుంటను ఆక్రమించుకోవడానికి తెగబడ్డాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తాను నిర్మించుకుంటున్న ఇంటి సమీపంలోని కుంట పోరంబోకు స్థలంలో పిల్లర్లు వేయడానికి గోతులు తీశాడు. ఆపై పనులను శరవేగంగా చేపట్టాడు. తిరుపతి–చంద్రగిరి రహదారికి ఆనుకుని భూమి ఉండడంతో మార్కెట్‌లో భారీగా విలువ ఉంది. విలువైన స్థలాన్ని అధికారం అడ్డంపెట్టుకుని ఆక్రమించుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.
మా నాయకుడు చెప్పాడు.. కట్టేస్తున్నాం
గుర్రాలకుంటలో అక్రమ నిర్మాణాలకు పూనుకున్న ఆ నేత, ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన తమ నాయకుడు చెప్పాడని, అందుకే తాను ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నానంటూ స్థానికులను బెదిరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. కుంటపోరంబోకులో అక్రమ నిర్మాణాలను చేసుకోమని ఆ నేత చెప్పడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధి పేరు చెప్పి అక్రమ నిర్మాణాలకు పాల్పడడం ఏమిటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గుర్రాలకుంటలో అక్రమ నిర్మాణాలు
అక్రమ నిర్మాణాలకు అడ్డు
గుర్రాలకుంట భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు తెలుసుకున్న తహశీల్దార్ శివరామసుబ్బయ్య, నిర్మాణాలను అడ్డుకోవాలంటూ సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో వీఆర్‌ఓతోపాటు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరంగా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. గుర్రాలకుంటలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ముందే చెప్పిన సాక్షి
గుర్రాలకుంట ఆక్రమణలపై ఈ నెల 16వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది. గతంలో ఇదే రీతిలో అక్రమణకు పాల్పడితే రెవెన్యూ అధికారులు అడ్డుకుని, హెచ్చరిక బోర్డును సైతం ఏర్పా టు చేశారు. అధికారుల హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా మరోసారి ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు సాక్షి గుర్తించింది. దీనిపై ‘ఆక్రమణల పోరంబోకులే..!’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది.


