ఏర్పేడు: చిత్తూరు ఆత్మ సౌజన్యంతో తిరుపతి జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో వాతావరణ ప్రతికూల పరిస్థితులలో వ్యవసాయ సాగులో రైతులు అనుసరించాల్సిన పద్ధతులపై బుధవారం రైతులకు శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా వనరుల కేంద్రం ఏఓ శ్రీనివాస్ పాల్గొని వాతావరణ ప్రతికూల పరిస్థితులలో రైతులు అనుసరించాల్సిన సాగు పద్ధతులను వివరించారు. విత్తన శుద్ధి చేసి మొక్కలను నాటుకోవడం, దేశీయ విత్తనాలను వాడడంతో కొంతవరకూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మంచి దిగుబడులను సాధించవచ్చని అన్నారు. ఏఓ సాగరిక మాట్లాడుతూ రైతులంతా ప్రకృతి వ్యవసాయంవైపు దృష్టి సారించాలన్నారు. అనంతరం రైతులతో కలసి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. రైతులకు కూరగాయ విత్తనాలు, ఆకు కూర గింజల ప్యాకెట్లు పంపిణీ చేశారు. రైతులకు శిక్షణ ధ్రువీకరణ పత్రాలను అందించారు. కార్యక్రంలో బీఆర్‌సీ ఇన్‌చార్జి రంగయ్య, ఏఈఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు డ్యూటీలు చేయలేం..
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న 10 మంది మహిళా పోలీసులు పోలీసు శాఖలో పనిచేయలేమని బుధవారం ఎంపీడీఓ వెంకటరత్నమ్మకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుశాఖలో బందోబస్తు డ్యూటీలు, ఇతర రకాల విధులుంటాయని, వాటిని నిర్వహించలేమన్నారు. మరో శాఖలకు మార్చాలని నాన్ విల్లింగ్ లెటర్లు ఇస్తున్నామని తెలిపారు. మండలంలోని 14 మంది ఉండగా ఇందులో నలుగురు విల్లింగ్ లెటర్ ఇవ్వగా, మిగిలిన 10 నాన్ విల్లింగ్ లెటర్ ఇచ్చారు. వీటిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంపీడీఓ వెంకటరత్నమ్మ తెలిపారు.
మధ్యాహ్న భోజనం తనిఖీ
వరదయ్యపాళెం: మధ్యాహ్నం భోజనం పథకంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ తప్పక పాటించాలని, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందజేయాలని తిరుపతి జిల్లా డీఈఓ కేవీఎస్ కుమార్ తెలిపారు. మండలంలోని గోవర్ధనపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఎంఈఓ సరస్వతి, ఉపాధ్యాయులు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్ వినోద్ పాల్గొన్నారు.
పుట్టగొడుగుల
పెంపకంపై శిక్షణ
చంద్రగిరి: స్వయం ఉపాధిలో భాగంగా గ్రామీణ ప్రాంతవాసులకు మూడు రోజులపాటు పుట్టగొడుగుల పెంపకంపై అందించిన శిక్షణ తరగతులు బుధవారంతో ముగిశాయి. ఎస్వీ అగ్రికల్చర్ కళాశాల ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పెంపకంపై చంద్రగిరి మండలం కొత్త శానంబట్ల గ్రామస్తులకు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో విత్తన తయారీలో పుట్టగొడుగులకు ఆశించే తెగుళ్లు, పురుగుల నివారణపై డాక్టర్ పి.అరుణశ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ వివరించారు. శిక్షణార్థులకు పుట్టగొడుగుల బెడ్డు, విత్తనాలు, కవర్లు, రబ్బర్ బాండ్లపై వారికి సూచనలు అందించారు. అనంతరం వివిధ పుట్టగొడుగుల రకాలు, వాటి పెంపకానికి సంబంధించిన బుక్‌లెట్‌లను వారికి అందించారు. ముగింపు కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.రెడ్డి శేఖర్, డాక్టర్ వేమన, అరుణశ్రీ, గ్రామస్తులు, వ్యవసాయశాఖ విద్యార్థులు పాల్గొన్నారు.


