– నెల్లూరు జిల్లా జైలు నుంచి తీసుకొచ్చిన పోలీసులు
పెళ్లకూరు: నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని బుధవారం పోలీసు కస్టడీ నిమిత్తం పెళ్లకూరు పోలీసు స్టేషన్‌కు పోలీసులు తీసుకువచ్చారు. స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంతో పోలీసులు పలు సెక్షన్లతో కేసులు నమోదు చేసి రిమాండ్‌పై జిల్లా జైలుకు ఆయనను తరలించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న కలవకూరు వద్ద స్వర్ణముఖి నదిలో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో చేపట్టిన ఇసుక అక్రమ తవ్వకాలను వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించి, పలు నాన్‌బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని రేణిగుంట ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. ఆయన్ను హుటాహుటిన కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. అనంతరం బుధవారం రోజున సత్యనారాయణరెడ్డిని రెండు రోజులు పోలీస్ కస్టడీ నిమిత్తం పెళ్లకూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న వివిధ ప్రాంతాల వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు స్టేషన్ వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ లోపలికి ఎవ్వరినీ అనుమతించలేదు. పోలీసు స్టేషన్ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించడంతో ఆందోళన చెందారు. కామిరెడ్డి భద్రతపై వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో పోలీసులు సత్యనారాయణరెడ్డిని విచారిస్తున్నట్లు సమాచారం.
13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
– ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాపూరు–పెంచలకోన మార్గంలో 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. రైల్వేకోడూరు సబ్ కంట్రోల్ ఆర్‌ఐ కృపానందకు చెందిన ఆర్‌ఎస్‌ఐ ఎన్.బాలచెన్నయ్య బృందం స్థానిక ఎఫ్‌ఓ జాన్ రంజిత్ కుమార్‌తో కలసి మంగళవారం నుంచి నెల్లూరు జిల్లా రాపూరు మండలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టింది. బుధవారం తెల్లవారుజామున పెంచలకోన రోడ్డులో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని రాపూరు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. వారిని విచారించి పరిసరాల్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 13 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఓ మోటారు సైకిల్‌తో పాటు అరెస్టయిన వారిని, ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారణ అనంతరం ఎస్‌ఐ రఫీ కేసు నమోదు చేశారు.
వరకట్నం కేసు నమోదు
పుత్తూరు: అత్తింటి వారు వరకట్నం వేధిస్తున్నట్టు వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. స్థానిక కృష్ణానగర్‌కు చెందిన ఎం.మోహనప్రియ(33)ను తిరుపతి చెర్లోపల్లి, రజక కాలనీకి చెందిన ఎం.రాజేష్‌కుమార్‌కు వచ్చి పెద్దలు పెళ్లి చేశారు. ఆమెను భర్త రాజేష్‌కుమార్, అత్త మంజుల వరకట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. అంతటి ఆగక ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఈ క్రమంలో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పుత్తూరు పోలీసులు బుధవారం తెలిపారు.
రైలు కింద పడ్డ విద్యార్థి
ఓబులవారిపల్లె:రేణిగుంట–నంద్యాల వెళ్లే డెమో ప్యాసింజర్ రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి రెడ్డెయ్య రైలు కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల కథనం.. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రాజంపేటకు చెందిన రెడ్డెయ్య ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం కళాశాలలో పరీక్షలు రాసి రాజంపేటకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. రన్నింగ్‌లో రైలు ఎక్కేందుకు ప్రయత్నించి జారి రైలు ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయాడు. విద్యార్థులు కేకలు వేయడంతో చైనులాగి వెంటనే రైలును నిలిపివేశారు. రెడ్డెయ్య కుడి కాలుకు తీవ్రంగా గాయమైంది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. గాయపడ్డ రెడ్డెయ్యను 108 వాహనంలో రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు.


