శ్రీసిటీలో ఘనంగా మహిళా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

శ్రీసిటీలో ఘనంగా మహిళా దినోత్సవం

Mar 10 2026 7:12 AM | Updated on Mar 10 2026 7:12 AM

శ్రీసిటీ (వరదయ్యపాళెం): వివిధ రంగాల్లో మహిళల ప్రాధాన్యతను గుర్తిస్తూ శ్రీసిటీ, స్థానిక పరిశ్రమలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ‘మహిళా హక్కులు, న్యాయం, అమలు’ అనే థీమ్‌తో జరుపుకుంటున్నారు. ‘‘సీ్త్ర సిటీ’’గా పేరొందిన శ్రీసిటీ, సమాన అవకాశాలతో వేలాది మహిళలకు ఉపాధి అందిస్తూ మహిళా సాధికారతకు తోడ్పడుతోంది. శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సంప్రదాయ పరిమితులను దాటి ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేస్తుండడం భారత సమాజంలో జరుగుతున్న సానుకూల మార్పునకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

వివిధ పరిశ్రమల్లో వేడుకలు

శ్రీసిటీలోని రాక్‌వర్త్‌, బ్రేక్స్‌ ఇండియా, హావెల్స్‌, ఎన్‌కేస్‌ ప్యాకేజింగ్‌, పానాసోనిక్‌, శ్రీసిటీ సెక్యూరిటీ విభాగం, ఇతర పలు సంస్థల్లో సోమవారం మహిళా దినోత్సవాన్ని ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. హావెల్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీసిటీ డైరెక్టర్‌ (సీఎస్‌ఆర్‌) నిరీషా సన్నారెడ్డి, పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రియాంక ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రమశిక్షణ, నైపుణ్యంతో పనిచేసిన మహిళా ఉద్యోగులకు ‘‘నారీ శక్తి అవార్డులు’’ అందజేశారు. శ్రీసిటీ బిజినెస్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాది శ్రీమతి అదిలక్ష్మి లోగమూర్తి మాట్లాడుతూ ఆత్మగౌరవం పెంపొందించుకోవాలని, స్వావలంబనతో ముందుకు సాగాలని సూచించారు.

మహిళా దినోత్సవ చర్చల్లో ప్రభుత్వం, బ్యాంకుల సాయంతో సూళ్లూరుపేటలో చపాతి తయారీ దుకాణం నడుపుతూ, శ్రీసిటీ హోటళ్లు, క్యాటరింగ్‌ సంస్థలకు చపాతీలు సరఫరా ద్వారా నెలకు రూ.2 లక్షల ఆదాయం ఆర్జిస్తున్న సూళ్లూరుపేటకు చెందిన నీలకుర్తి మీనా విజయ గాథ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement