ఏడుగురు దొంగల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఏడుగురు దొంగల అరెస్టు

Mar 10 2026 7:12 AM | Updated on Mar 10 2026 7:12 AM

పాకాల: బావుల వద్ద మోటార్లకు అమర్చిన కాపర్‌ వైర్లు, పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగలను అరెస్టు చేసినట్లు పాకాల సీఐ చినగోవిందు తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రగిరి ఎస్‌డీపీఓ బేతపూడి ప్రసాద్‌ సూచనలతో ఒక బృందంగా ఏర్పడి చోరీలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 8వ తేదీన పాకాల మండల కేంద్రానికి సమీపంలోని బ్రిడ్జ్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో నలుగురు వ్యక్తులు అనుమాస్పదంగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించామన్నారు. పోలీసులను చూసి నలుగురు వ్యక్తులు ఆటోను వదిలేసి పరుగులు తీశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారన్నారు. వారి వద్ద ఉన్న సంచుల్లో కాపర్‌ కేబుల్‌ వైర్లు, చోరీలకు వాడే పనిముట్లు ఉండగా గుర్తించామని తెలిపారు. విచారణలో రేణిగుంటకు చెందిన నల్లతంబి శ్రీనివాస్‌, తుమ్ములగుంటలోని కుర్రకాలువ కె.ఫృధ్వీరాజ్‌, రేణిగుంట మండలం రామకృష్ణాపురం గ్రామానికి నాగపూర్‌ బలరాం, దేవరాజ్‌, మురగేశ్‌గా గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తును కొనుగోలు చేసిన వారిని కూడా పట్టుకున్నట్లు తెలిపారు. వారిలో దామినేడుకు చెందిన గంగిశెట్టి, రేణిగుంటకు చెందిన గడ్డం హరి, తిరుచానూరుకు చెందిన రాజ్‌దేవ్‌గా గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 2 వేల మీటర్ల కాపర్‌ కేబుల్‌ వైర్లు, డెల్‌ కంపెనీ ల్యాప్‌టాప్‌, రెడ్మీ మొబైల్‌ ఫోన్‌, ఎఫ్‌ఓడీజీ ఫ్యాషన్‌ స్మార్ట్‌ వాచ్‌, రెండు గ్రాముల బంగారు ఉంగరం, 1.9 గ్రాముల ఒక జత పిల్లల చెవి మాటీలు, కేబుల్‌ కట్టర్‌, తాళాలు పగలగొట్టడానికి ఉపయోగపడే ఇనుప రాడ్లు, ఆటో రిక్షా, టీవీ, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు ఛేదించిన సీఐ చినగోవిందు, ఎస్‌ఐ తరుణ్‌ని జిల్లా ఎస్పీ ఎల్‌ సుబ్బరాయుడు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement