ట్రాన్స్‌ఫార్మర్ల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్ల తొలగింపు

Mar 9 2026 7:45 AM | Updated on Mar 9 2026 7:45 AM

జగనన్న కాలనీలకు

మౌలిక వసతులు దూరం

గత వైఎస్సార్‌సీపీ హయాంలో

ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు మాయం

విద్యుత్‌ స్తంభాలను సైతం

తొలగిస్తున్న వైనం

లబ్ధిదారులకు లేని కరెంట్‌ సౌకర్యం

తాగునీటికి సైతం

తిప్పలు పడుతున్న ప్రజానీకం

రేణిగుంట సమీపంలోని జీపాళెంలో అతిపెద్ద జగనన్న కాలనీలో ఏర్పాటు చేశారు. తిరుపతి అర్బన్‌ పరిధిలో సొంత ఇల్లులేని అనేక మందికి జీపాళెం జగనన్న కాలనీల్లో ఉచితంగా ఇంటి స్థలం ఇచ్చి పక్కాగృహ నిర్మాణానికి నిధులు సైతం మంజూరు చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత జీపాళెం జగన్న కాలనీలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో రెండింటిని అధికారులే తొలగించినట్లు స్థానికులు చెబుతున్నారు. మరో చోట కొత్తది తీసేసి ఆ స్థానంలో పాత ట్రాన్స్‌ఫార్మర్‌ని ఏర్పాటు చేశారు. దీనిపై ట్రాన్స్‌కో అధికారులను ప్రశ్నిస్తే.. ‘మిమ్మల్ని అడిగి చేయాలా? మీ అనుమతి తీసుకోవాలా? మా ఇష్టం, మీరెవరు అడిగేందుకు’ అని బెదిరించినట్లు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అనేక చోట్ల విద్యుత్‌ వైర్లు కూడా తొలగించటంతో కరెంటు సరఫరా లేక అనేక మంది లబ్ధిదారులు తిరిగి తిరుపతికి చేరుకుని అద్దె నివాసంలో జీవనం సాగిస్తున్నారు. ఇలా రేణిగుంట మండలం అడుసుపాళెంతోపాటు, నగరి, పలమనేరు, చిత్తూరు పరిధిలోని జగనన్న కాలనీల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు తొలగించి, ఆ స్థానంలో పాతవి పెట్టినట్లు లబ్ధిదారులు వెల్లడిస్తున్నారు. చిత్తూరు పరిధిలోని ఓ జగనన్న కాలనీలో అయితే టీడీపీ శ్రేణులు దౌర్జన్యంగా విద్యుత్‌ స్తంభాలను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న కాలనీలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వాటిని టీడీపీ కార్యకర్తలే అపహరించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బోర్లు వాటి కేసింగ్‌ కేబుల్‌,నీటి తొట్టెలు, ఇనుప సామాన్లను చోరీ చేసినట్లు వివరిస్తున్నారు. దీనిపై హౌసింగ్‌ అధికారులు కనీసం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.

సాక్షి ప్రతినిధి, తిరుపతి : జగనన్న కాలనీలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. గత వైఎస్సార్‌సీపీ హయాంలో కల్పించిన మౌలిక వసతులన్నింటినీ లబ్ధిదారులకు దూరం చేస్తోంది. అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను సైతం పట్టించుకోవటం లేదు. ఫలితంగా జగనన్న కాలనీల్లో నివాసం ఉంటున్న నిరుపేదలు నరకం అనుభవిస్తున్నారు.

నీరుగార్చడమే లక్ష్యం

గూడు లేని ప్రతి ఒక్కరికి సొంతిల్లు కల్పించాలనే ఉన్నత ఆశయంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న కాలనీలకు శ్రీకారం చుట్టారు. భూములను కొనుగోలు చేసి మరీ పేదలకు ఉచితంగా ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం పక్కాగృహాలు నిర్మాణం చేపట్టి కొత్తగా ఊర్లనే నిర్మించారు. ఈ క్రమంలోనే రూ.కోట్లు వెచ్చించి అత్యాధునికంగా మౌలిక వసతులు కల్పించారు. అందులో భాగంగా తాగు నీటి కోసం బోర్లు వేసి కుళాయిలు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ సౌకర్యం కోసం కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చి ఇంటింటికీ కరెంటు కనెక్షన్‌ ఇప్పించారు. కాలనీల్లో రోడ్ల నిర్మాణం కోసం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న కాలనీలపై ప్రతీకార చర్యలకు పూనుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాగునీటికి కటకట

జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన అనేక బోర్లు పనిచేయడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నింటికి విద్యుత్‌ సౌకర్యం లేక పోవడం, మరి కొన్నింటి మీటర్లు, స్టార్టర్లు చోరీకి గురయ్యాయని చెబుతున్నారు. అలాగే కొన్ని చోట్ల భూగర్భ జల మట్టం పడిపోవడంతో నీటి కొరత ఏర్పడుతోందని వివరిస్తున్నారు. ఫలితంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలోని అనేక జగనన్న కాలనీల్లో తాగునీటికి కటకటలాడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోతే ఈ వేసవిలో తాగునీటి సమస్య తీవ్రతరం అవుతుందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అనేక కాలనీల్లో రోడ్లు లేక కాలనీవాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వస్తే కాలనీలు బురదమయంగా మారుతున్నాయి. కాలనీల్లో పిచ్చి మొక్కలు తొలగించే వారు కూడా కరువయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న కాలనీలపై కక్ష సాధింపులో భాగంగా అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారుల తీరుతో కాలనీల్లో నివాసం ఉంటున్న వారు సైతం తిరిగి అద్దె నివాసాల్లోకి చేరుకోవాల్సి పరిస్థితి. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న జగనన్న కాలనీలను పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

పేదల ఇళ్లపై చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం

ముడుపులు ఇస్తేనే విద్యుత్‌ కనెక్షన్‌

శ్రీకాళహస్తి సమీపంలోని రాజీవ్‌నగర్‌, టైలర్స్‌ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ కావాలంటే లబ్ధిదారులు ముడుపులు చెల్లించాల్సి వస్తోంది. కనీసం రూ.70వేలు చెల్లిస్తేనే కరెంట్‌ కనెక్షన్‌ ఇస్తామని ట్రాన్స్‌కో సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు చెప్పేది ఒక్కటే. విద్యుత్‌ పోల్‌ ఏర్పాటు చేసుకుంటావా? వైర్లు లాక్కుంటావా? అని అడుగుతున్నారు. అందుకు అంగీకరిస్తే మళ్లీ రూ.70వేలు ముట్టజెప్పాల్సిన పరిస్థితి. అలా రూ.70వేల చొప్పున చెల్లించి కరెంట్‌ కనెక్షన్‌ తీసుకున్నట్లు ముగ్గురు లబ్ధిదారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement