తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఆదివారం ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు అన్ని విభాగాల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే అర్జీదారులకు తాగునీరు, కుర్చీలు ఏర్పాటు చేయాలని, వినతులు రాసేందుకు సచివాలయ ఉద్యోగులను అందుబాటులో ఉంచాలని సూచించారు. అర్జీదారులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే వినతులు సమర్పించిన వారు తమ అర్జీ ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. అలాగే అర్జీదారుల ఫోన్ నంబర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుందని వెల్లడించారు. ఇది వరకే గ్రీవెన్స్‌లో వినతి ఇచ్చినవారు సంబంధిత స్లిప్‌ను తీసుకురావాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,838 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,006 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
టీటీడీకి రూ.70 లక్షల విరాళం
తిరుమల: విశాఖపట్నంకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు త్రిపురనేని వెంకటరత్నం, మాధురి దంపతులు ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు. అదేవిధంగా ఆయన కుమారులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్‌లు కూడా చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధి పొట్లూరి నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరికి విరాళ డీడీని అందజేశారు.
హోరాహోరీగా ‘స్పోర్ట్స్ లీగ్’
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి శాప్ మాస్టర్స్ స్పోర్ట్స్ లీగ్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ మేరకు టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలను 35, 40, 45ఏళ్ల పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్వహించారు. విజేతలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ ఎన్.శశిధర్, ఎస్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జనార్ధన్‌నాయుడు, జీఎం ఎం.మురళీకుమార్, జేఏఓ టి.అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
తిరుపతి అర్బన్ : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా రిజిస్ట్రేషన్ ఎంప్లాయీస్ అసోషియేషన్ నూతన అధ్యక్షుడు పి.బాలాజీ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ సబ్‌రిజిస్ట్రార్ అసోషియేషన్ భవనంలో ఉద్యోగుల నూతన కమిటీ ఎన్నిక చేపట్టారు. పలమనేరు సబ్ రిజిస్ట్రార్ టి.సుబ్రమణ్యం, తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ సి.విజయకుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. పి.బాలాజీని అసోషియేషన్ అధ్యక్షుడిగా, ఏ. అరుణ్‌కుమార్‌ను ఉపాధ్యక్షుడిగా, జి.అనిల్‌కుమార్‌ను జనరల్ సెక్రటరీగా, బి.కమల్‌నాథ్‌ను జాయింట్ సెక్రటరీగా, ఎన్. నజీబ్‌ను కోశాధికారిగా, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎస్‌ఎం రహంతుల్లా, పి.ఉదయకుమార్, ఎం.జోత్మిర్మయి, పి.రూపావాణిని ఎంపిక చేశారు. నూతన కమిటీని సంఘం నేత జీవీ కొండారెడ్డి, శ్రీరామ్‌కుమార్, బి.విజయభాస్కర్ అభినందించారు.
భూ ఆక్రమణపై కేసు
రేణిగుంట: సర్కారు భూమిని ఆక్రమించడమే కాకుండా ప్రభుత్వోద్యోగుల విధులను అడ్డుకున్నందుకు లోకేశ్వర్‌రెడ్డి, లక్ష్మయ్య అనే వ్యక్తులపై తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ రేణిగుంట మండలం కొత్తపాళెంలో 99 సెంట్ల అనాధీనం భూమిని నిందితులు కబ్జా చేశారన్నారు. వారు వేసిన ఫెన్సింగ్ తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అయితే నిందితులు ఆ బోర్డును తీసేయడమే కాకుండా రెవెన్యూ సిబ్బంది విధులకు భంగం కలిగించారని పేర్కొన్నారు.


