సాధికారతతో సమాజాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సాధికారతతో సమాజాభివృద్ధి

Mar 9 2026 7:45 AM | Updated on Mar 9 2026 7:45 AM

తిరుపతి రూరల్‌ : మహిళల సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కార్పొరేషన్‌ కమిషనర్‌ మౌర్యతో కలసి కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళల జీవితంలో ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్యం, ఆనందం అనే మూడు అంశాలు ఎంతో ముఖ్యమన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి కుటుంబంలో ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు వివరించారు. డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో 14,600 స్వయం సహాయక సంఘాలకు గత 11 నెలల్లో సుమారు రూ.2,600 కోట్లకు పైగా రుణాలు అందించామని తెలిపారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. కమిషనర్‌ మౌర్య మాట్లాడుతూ ప్రతి మహిళ ‘‘థింక్‌ బిగ్‌, డ్రీమ్‌ బిగ్‌, బిలీవ్‌ బిగ్‌, అచీవ్‌ బిగ్‌’’అనే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహ యాదవ్‌, ఎస్సీ సెల్‌ డైరెక్టర్‌ కుమారి, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ పసుపులేటి హరిప్రసాద్‌, క్లీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ చైర్మన్‌ సుగుణమ్మ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రకోటి సదాశివం, అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ స్రవంతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement