పింఛనే శ్వాస.. | - | Sakshi
Sakshi News home page

పింఛనే శ్వాస..

Feb 8 2026 3:50 AM | Updated on Feb 8 2026 3:50 AM

పింఛన

పింఛనే శ్వాస..

● పింఛన్‌ల కోసం ఏదీ ఎన్‌టీఆర్‌ భరోసా ● పెండింగ్‌లో వేల దరఖాస్తులు ● మిగిలిన నియోజకవర్గాల్లోని అర్హులపై చిన్నచూపు ● చంద్రబాబు సర్కారుపై అర్హులు మండిపాటు ● నిత్యం పీజీఆర్‌ఎస్‌లో పింఛన్‌ల అర్జీలు నమోదు

జాడ లేని ఎన్‌టీఆర్‌ భరోసా

చిత్తూరు కలెక్టరేట్‌ : చంద్రబాబు సర్కారు ప్రజలు, నియోజకవర్గాల మధ్య తారతమ్యం చూపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్క కొత్త పింఛన్‌ కూడ మంజూరు చేయకపోగా కుప్పం నియోజకవర్గానికి మాత్రం పెద్దపీట వేసుకుంది. కుప్పం నియోజకవర్గానికే ప్రత్యేక రూల్‌ అనే ధోరణిలో బాబు సర్కారు వ్యవహరిస్తోంది. రెండేళ్లు ఒక కొత్త పింఛన్‌ కూడ ఇవ్వకపోగా ఉన్న పింఛన్లను రాజకీయ రంగును పులిమి తొలగించింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లో మూడు రెవెన్యూ డివిజన్‌లు 36 మండలాల పరిధిలో 22,99,699 మంది జనాభా ఉన్నారు. పింఛన్‌ల పంపిణీ అధిక ప్రాధాన్యతనిస్తున్నామని డప్పులు కొట్టుకుని ప్రచారం చేస్తున్న చంద్రబాబు సర్కారు కొత్త పింఛన్‌ల మంజూరుపై అలసత్వం వహిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గం తప్ప ఇతర నియోజకవర్గాల్లో ఒక్క కొత్త పింఛన్‌ సైతం మంజూరు చేయలేయని దుస్థితి. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే వంద లాది మంది అర్హులు పింఛన్‌లు మంజూరు చేయండి సారూ అంటూ మొరపెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ పింఛన్‌ అర్జీదారులకు న్యాయం చేయలేక ఉన్నతాధికారులు మిన్నకుండిపోతున్నారు.

ప్రతి వారం పీజీఆర్‌ఎస్‌లో అర్జీలే

కొత్త పింఛన్లు మంజూరు కోసం అర్హులు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు అందజేస్తున్నారు. కొత్త పింఛన్‌ ఇవ్వాలంటూ అధికారుల ఎదుట తమ గోడును విన్నవించుకుంటున్నారు. ప్రస్తుత సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ల మంజూరుకు పీజీఆర్‌ఎస్‌లో 20,452 అర్జీలు నమోదైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ అర్జీల్లో ఒక్కరికి కూడా న్యాయం చేయలేని నిస్సహయతలో అధికారులు మిన్నకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లే చంద్రబాబు సర్కారు ఎమ్మెల్యేలకు సైతం చేదు అనుభవం ఎదురవుతోంది. ఒక్క పింఛన్‌ ఇప్పించలేని ఎమ్మెల్యేతో లాభమేమి అంటూ అర్హులు విమర్శలు గుప్పిస్తున్నారు.

కుప్పానికి ప్రత్యేక రూల్‌

వైఎస్సార్‌ సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు తావు లేకుండా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను అందజేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుని నియోజకవర్గం అయినప్పటికీ గత సర్కారులో 35,637 మందికి పింఛన్లు పంపిణీ చేసేవారు. ప్రస్తుత సర్కారులో ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే కొత్త పింఛన్లను పంపిణీ చేస్తూ మిగిలిన నియోజకవర్గాలకు అన్యాయం చేస్తున్నారు. నియోజకవర్గాల మధ్య తారతమ్యం చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. కుప్పానికి మాత్రం ప్రత్యేక రూల్‌ అనే ధోరణిలో 3,895 కొత్త పింఛన్లను మంజూరు చేశారు. మిగిలిన నియోజకవర్గాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కొత్త పింఛన్‌ కూడా మంజూరు చేయకుండా మోసం చేస్తున్నారు.

పింఛన్ల కోతకే ప్రాధాన్యం

చంద్రబాబు సర్కారు కొత్త పింఛన్ల మంజూరు కంటే ఉన్న పింఛన్లలో కోత విధించేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2,71,183 మందికి పింఛన్లు అందజేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం జిల్లాలో 2,64,902 పింఛన్‌లను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 19,500 మంది పింఛన్‌లను తొలగించి అర్హుల పొట్ట కొట్టారు. వేల సంఖ్యలో పింఛన్‌లను తొలగించడంతో బాధితులు చంద్రబాబు సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు.

పింఛన్‌ కోసం ఎదురు చూపులు

మాది తవణంపల్లి మండలం చింతమాకులపల్లి గ్రామం. నా కుమార్తె నివేదిత దీర్ఘకాల వ్యాధితో చాలా రోజులుగా ఇబ్బంది పడుతోంది. దినచర్యలో సొంతంగా ఏ పనిచేసుకోలేక కండరాల బలహీనతతో అవస్థలు పడుతోంది. ఇప్పటికే వైద్యం కోసం స్థోమత ఉన్నంత వరకు ఖర్చు చేశాం. ప్రస్తుతం కుటుంబ పోషణ కష్టంగా ఉంది. ప్రభుత్వం నుంచి అందించే రూ.15 వేల పింఛన్‌ కోసం అధికారులకు అర్జీలు అందజేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. కొత్త పింఛన్‌లకు అవకాశం కల్పిస్తే మాకు న్యాయం చేసినట్టవుతారు.

– కుమార్తె నివేదితతోఈశ్వర్‌

మంచం పట్టినా మంజూరు కాలేదు

మాది తవణంపల్లి మండలం ఏ గొల్లపల్లి పంచాయతీ వడ్డిఇళ్లు గ్రామం. మేసీ్త్ర పనిచేస్తేనే మా కుటుంబం ముందుకుసాగుతుంది. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. నా భర్త మేసీ్త్ర పని చేస్తుండగా కిందపడి కాళ్లు, చేయి, తలకు పెద్ద గాయాలు అయ్యాయి. పనికి వెళ్లలేని దుస్థితి. మంచానికే పరిమితమయ్యాడు. వికలాంగ పింఛన్‌ కోసం చాలా సార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాం. నెలలు గడుస్తున్నా మాకు కొత్త పింఛన్‌ ఇవ్వడం లేదు. ఇంకెప్పుడు కొత్త పింఛన్ల ఇస్తారో అర్థమే కావడం లేదు. – బాధితుడు సుబ్రహ్మణ్యం, పిల్లలతో భార్య లోకేశ్వరి

పింఛనే శ్వాస..1
1/2

పింఛనే శ్వాస..

పింఛనే శ్వాస..2
2/2

పింఛనే శ్వాస..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement