సంస్కృతికి ప్రతీక సంస్కృత భాష
తిరుపతి సిటీ: భారతీయ సంస్కృతి, దేశ వికాసానికి సంస్కృత భాష ప్రతీకని టీటీడీ అడిషన్ ఈఓ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీలో నాలుగు రోజులుగా జరిగిన నేషనల్ టాలెంట్ ఫెస్ట్–2026 కార్యక్రమం ఘనంగా ముగిసింది. శనివారం వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆధ్యాత్మికత మానవుని సన్మార్గంలో నడిపించే ఒక శక్తి అని చెప్పారు. అనంతరం పలు శాస్త్ర విభాగా ల్లో జరిగిన ప్రతిభా పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అతిథులు చేతుల మీదుగా టోఫ్రీలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, పూరిలోని జగన్నాథ సంస్కృత వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ కిషోర్ చంద్ర పాడి, డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, ప్రొఫెసర్ దక్షణమూర్తి శర్మ, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ విజయవంతం
తిరుపతి రూరల్: పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో ‘‘నేషన్ వైడ్ రూల్ అవుట్ ఆఫ్ ఎన్‌పీఎస్‌టీ అండ్ ఎన్‌ఎంఎం’’ అన్న అంశంపై శనివారం రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన సదస్సులో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అకాడమిక్ అడ్వైజర్ డీకే చతుర్వేది మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను వినియోగించి అందరికీ నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. వైస్ ఛాన్సలర్ వి.ఉమ మాట్లాడుతూ సమాజంలోని ఉన్నతస్థాయి వ్యక్తులందరూ తమ గురువుల చేతిలో రూపుదిద్దుకున్నవారే అన్నారు. ఎన్‌సీటీఈ ఎన్‌ఎంఎం ఇంప్లిమెంటేషన్ కమిటీ సభ్యుడు జ్ఞానేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ప్రత్యేకతను గుర్తించి ప్రోత్సహించడమే ఉపాధ్యాయుని ముఖ్యవిధి అన్నారు. డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో సామర్థ్యాలు పెంపొందించుకొని నాణ్యమైన విద్య అందించాలన్నారు. వర్క్ షాప్‌లో ఎన్‌సీటీఈ సభ్యులు డాక్టర్ చంచల్ మల్హోత్రా, ప్రొఫెసర్ టి.జి అముదవల్లిలతో పాటు పలువురు విద్యాశాఖ అధికారులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ ఎదుట కామిరెడ్డి బైఠాయింపు
పెళ్లకూరు: స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి న్యాయం కోసం బైఠాయించారు. చిల్లకూరులోని మన్నేమత్తేరి చెరువుకట్టపై చాలా కాలంగా వేపచెట్లు ఉన్నాయి. గ్రామానికి చెందిన మహేష్, మరి కొందరు కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా వేప చెట్లను నరికివేశారు. స్థానిక సర్పంచ్ పగడాల హరిబాబురెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులతోపాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు నిందితులు, వారు ఉపయోగించిన ఆటో, పనిముట్లను అప్పగించి, రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చేలోపు పోలీసులు నిందితులను వదిలేశారు. దీంతో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని, ఇచ్చిన ఫిర్యాదుపై రసీదు ఇచ్చే వరకు పోలీస్‌స్టేషన్ నుంచి కదిలేదిలేదని బైఠాయించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు వచ్చి ‘పోలీస్‌స్టేషన్ వద్ద ఎందుకు కూర్చున్నావు? రసీదు ఇవ్వడానికి నువ్వు ఫిర్యాదు ఇచ్చావా?.. ముందు స్టేషన్ దాటి అవతలకు వెళ్లు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుకట్టపై ఉన్న వేప చెట్లు నరికిన నిందులను పోలీసులకు పట్టించినప్పటికి కేసు నమోదు చేయకుండా వదిలేసిన పోలీసులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సత్యనారాయణరెడ్డి కోరారు. ఈవిషయమై సీఐ సంగమేశ్వరరావు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.
సంస్కృతికి ప్రతీక సంస్కృత భాష


